వినాయక చవితి దగ్గర పడుతున్నందన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి రోజున అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. ఈ ఏడాది 51 అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్తిష్టించనున్నారు. ఆలాగే వచ్చేవారం వినాయకుడికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
గత ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది 50 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఖైరతాబాద్ గణేషుడిని గత ఏడాది తొలిసారి మట్టితో రూపొందించారు. ఈ సారి కూడా మట్టి విగ్రహమే ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగను తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు. గణేష్ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి..
ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్నారు. మట్టి విగ్రహం కావడంతో మొదట ఐరన్ ఫ్రేమ్‌తో అవుట్‌లైన్ తయారు చేస్తారు. అనంతరం దానిపై గడ్డిని మట్టితో కలిపి నారలాగా తయారుచేసి ఐరన్ చుట్టూ ఔట్ లుక్ కోసం అంటిస్తారు. దానిపై టన్నుకు పైగా సుతిలి తాడును చుడతారు. దానిపై మట్టితో రూపు రేఖల్ని తీర్చి దిద్దుతారు. ఆ తర్వాత గాడా క్లాత్‌పై పల్చటి మట్టిని పూసి ఫినిషింగ్ పనులు పూర్తి చేసి.. వాటర్ పెయింట్స్ వేయడంతో మట్టి వినాయకుడు పూర్తిస్థాయిలో పూర్తవుతుంది.
విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తవని నిర్వాహకులు చెబుతున్నారు.1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన గణేశుడి చరిత్ర 60 అడుగుల ఎత్తు వరకు కొనసాగింది. గడిచిన 67 సంవత్సరాల్లో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ పీవోపీ గణపతిని విభిన్న రూపాల్లో ప్రతిష్టిస్తూ వస్తున్నారు. 67 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహా గణపతి పీవోపీ ద్వారా రూపుదిద్దుకుంటున్నాడు. గత ఏడాది మొట్ట మొదటిసారిగా మట్టితో శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని ప్రతిష్టించారు. ఈ సారి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నారో వచ్చే వారంలో ప్రకటించనున్నారు.