వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ కార్యక్రమం కూడా అక్కడా ఇక్కడా కాకుండా ఏకంగా ఇడుపుల పాయలోనే జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తూండటం రాజకీయంగా సంచలనం సృష్టించేదే. నిజమో కాదో అధికారికంగా ప్రకటించేదాకా స్పష్టత లేదు కానీ.. నిజంగానే ఇలాంటి పరిణామం జరిగితే మాత్రం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతుందని అనుకోవచ్చంటున్నారు.
జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కడపజిల్లాలోని ఇడుపులపాయకు రానున్నారని, అక్కడ వైఎస్ సమాధి వద్ద నివాళులు ఆర్పించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే వైఎస్ కుటుంబం మరలా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుందని అనుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలంగా ఉన్నప్పటికీ, ఏపీలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. గత రెండు ఎన్నికల్లోనూ ఒక్కసీటును కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.
మరి వైఎస్ కుటుంబం ఆ పార్టీతో కలిస్తే కాంగ్రెస్‌కు మళ్లి పునర్వైభవం సాధ్యమౌతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. సొంతంగా పార్టీ నడపడం కన్నా జాతీయ పార్టీలో విలీనం చేయడం మంచిదని అనుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లాడారని.. విలీనంపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న రోజుల్లో నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సత్సంబంధాలు ఉండేది.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ఆర్ కీలక పాత్రను పోసించారు. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం. ఈ కారణం చెప్పి షర్మిల పార్టీని విలీనం చేయవచ్చని భావిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే.. ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుంది. వైఎస్ .. తన జీవితాంతం కాంగ్రెస్ నే అంటి పెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు అత్యున్నత పదవులు లభించాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత.. సోనియాపైనే జగన్ కుటుంబం దారుణ నిందలు మోపింది .
పార్టీకి తలనొప్పిగా మారిన ఎంపీ కామెంట్స్.
వైఎస్ మరణం వెనుక సోనియా హస్తం ఉందని కూడా ఆరోపించారు. తమపై అక్రమ కేసులు పెట్టించారని కూడా విమర్శించారు. సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచే అదీ కూడా వైఎస్ వారసుల్లో ఒకరు కాంగ్రెస్ చేరడం చిన్న విషయం కాదని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటు బ్యాంక్‌ను దగ్గరకు తీసుకోవడానికి ఇవి ఇవి ఉపయోగపడాయని అనుకుంటున్నారు.ఇప్పటి వరకూ జూలై ఎనిమిదో తేదీన సోనియా, రాహుల్ ఇడుపులపాయకు వస్తారన్న క్లారిటీ లేదు. అదే జరిగితే మాత్రం.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి ప్లాన్లు అమలు చేయడం ప్రారంభించిందని అనుకోవచ్చు.