Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆగని ట్రాఫిక్ కష్టాలు..

0

హైదరాబాద్, ఫిబ్రవరి 6,
హైదరాబాద్ శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. బండి తీసుకుని బయటకు వస్తే పార్కింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్‌కు అనుగుణంగా రూ.కోట్లు వెచ్చించి స్థల సేకరణ చేస్తూ, రోడ్లను విస్తరించినా, ఆశించిన ఫలితం దక్కడం లేదు. రోడ్డులను విస్తరించి, ఫుట్‌పాత్‌లను నిర్మిస్తే, వాటిపై వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి. వాటిని తొలగించటంలో వివిధ ప్రభుత్వ శాఖలకు రాజకీయంగా ఒత్తిళ్లు రావటంతో చేసేదేమీ లేక అధికారులు మౌనం వహిస్తున్నారు. బిజీగా ఉండే జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ ఆఫీసులతో పాటు విద్యా, ఉపాధి శాఖకు చెందిన ఇతరత్ర కార్యాలయల్లోనూ వచ్చే వాహనాలకు తగిన విధంగా పార్కింగ్ సౌకర్యం లేకపోవటంతో పార్కింగ్ విషయంలో వాహనదారుల మధ్య గొడవలు కూడా జరుగుతున్న సందర్భాలున్నాయి.

వాహనాలు రోజురోజుకి పెరుగుతున్నా, ఆ సంఖ్యకు తగిన విధంగా పార్కింగ్ పెరిగే అవకాశం లేకపోవడంతో ఎటు చూసిన అక్రమ పార్కింగ్‌లే దర్శనమిస్తున్నాయి. పార్కింగ్ సక్రమంగా లేకపోవడం, పార్కింగ్ ఫుల్‌ అయి వాహనం లోపల చిక్కకుపోవటం వంటి ఘటనల నేపథ్యంలో పలు ఫంక్షన్లు, నమాయిష్ వంటి ప్రదర్శనలకు కార్లున్న వారు సైతం వాటిని తీయకుండా ఆటోల్లో వెళ్తున్నారంటే నగరంలో పార్కింగ్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయవచ్చు.మహానగరంలోని రెసిడెన్షియల్, కమర్షియల్ ఏరియాల్లో నిర్మితమవుతున్న భవనాలు, కమర్షియల్ భవనాల్లో వాటిని నిర్మించే ఏరియాలో కనీసం 25 శాతం పార్కింగ్‌కు కేటాయించాలన్న నిబంధనకు విరుద్దంగా నిర్మించిన భవనాల్లో కార్యకలాపాలు కొనసాగేందుకు, ఆ భవనానికి సమీపంలో వ్యాలెట్ పార్కింగ్‌ను ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపడుతుందే తప్పా, పార్కింగ్ సౌకర్యం కేటాయించని భవనాలపై చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి కమర్షియల్ భవనాలను నిర్మించిన ఏరియాలో 25 శాతం పార్కింగ్ లేకుంటే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయటం వంటి చర్యలను గతంలో చేపట్టిన జీహెచ్ఎంసీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవటం లేదు. ఫలితంగా నిన్నమొన్నటి వరకు రోడ్డుకిరువైపులా కన్పించే అక్రమ పార్కింగ్ ఇపుడు రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. ఇలాంటి సీన్లు ఎక్కువగా సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, కాచిగూడ, పంజాగుట్టతో పాటు దాదాపు అన్ని మెయిన్ రోడ్లు, సబ్ రోడ్లలోనూ కన్పిస్తున్నాయి.కమర్షియల్ కాంప్లెక్సులు కొన్నింటిలో జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం పార్కింగ్ సౌకర్యమున్నా, వాటిని పెయిడ్ పార్కింగ్‌లుగా చెలామణి చేస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు. సికింద్రాబాద్ వైఎంసీఏ ఎదురుగా ఉన్న భవనంలో ఇలాంటి తతంగమే కొనసాగుతున్నా, జీహెచ్ఎంసీ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది.

నగరంలోని అసెంబ్లీకి కూత వేటు దూరంలోని పేరుగాంచిన ఓ హోటల్ ఏళ్ల నుంచి పార్కింగ్‌గా ఫుట్ పాత్‌ను వినియోగిస్తున్నా, కనీసం ప్రశ్నించే నాథుడే కరవయ్యాడు. ఈ హోటల్‌కు జీహెచ్ఎంసీ, బల్దియా, అసెంబ్లీ‌కి చెందిన ఉన్నతాధికారులు వచ్చి వెళ్తుంటారే తప్పా, జరుగుతున్న తతంగాన్ని పట్టించుకోకపోవటం వారి విధి నిర్వహణకు నిదర్శనమన్న విమర్శలున్నాయి.మహానగరంలో పేరుగాంచిన పలు షాపింగ్ కాంప్లెక్సులు, హోటల్స్, బార్, రెస్టారెంట్లు వంటి ఇతర వ్యాపార సంస్థల్లో జీహెచ్ఎంసీ పెయిడ్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెల్సిందే. వీటిలో సగం శాతం మహిళలకు కేటాయించినా, నేడు ఈ కాంట్రాక్టు మొత్తం పార్కింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. బడా షాపింగ్ కాంప్లెక్సుల్లో ద్విచక్రవాహనానికి రెండు గంటల పార్కింగ్‌కు రూ.20, కారుకు రూ.50 వసూలు చేస్తున్నా, పట్టించుకునే వారే కరవయ్యారు. కొద్ది ఏళ్ల క్రితం ఈ రకమైన పార్కింగ్ దోపిడీపై బల్దియా చర్యలు చేపట్టినా, వాటి అమలు అంతంతమాత్రమే.

ట్రాఫిక్ సమస్య నివారణ‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసినా, నిబంధనలు ఏ మాత్రం అమలు కావటం లేదు. నో పార్కింగ్ జోన్‌లోనూ వాహనాలను పార్కింగ్ చేస్తున్నా, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కనీసం ప్రశ్నించలేకపోతున్నారు. ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్, సందడి ఎక్కువగా ఉండే షాపుల నుంచి ట్రాఫిక్ పోలీసులు నెలసరి మామూళ్లు తీసుకుంటూ మౌనం వహించటం ఒక కారణమైతే, కొందరు బడా బాబులు, ప్రజాప్రతినిధులకు చెందిన వ్యాపార సంస్థలు కావటం వల్ల వారెలాంటి చర్యలు తీసుకోకపోవటం మరో కారణంగా చెప్పవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie