- మల్లా రాజిరెడ్డి మృతిపై రాని క్లారిటీ
- చనిపోయింది రాంచంద్రారెడ్డి అని ప్రచారం
- ఆరా తీస్తోన్న రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు
- ఎలాంటి ప్రకటనా చేయని మావోయిస్టు పార్టీ
మావోయిస్టు నేత మల్లా రాజిరెడ్డి మృతి చెందారనే జరుగుతున్న ప్రచారం మీద క్లారిటీ రావడం లేదు. ఈ నెల 16న ఛత్తీస్గఢ్రాష్ట్రం బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఏరియా ఉసూర్ బ్లాక్ లో అనారోగ్యంతో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత ఎవరు? ప్రచారం జరుగుతున్నట్లు చనిపోయింది పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రాజులపల్లెకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డా (70)? సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లెకు చెందిన రాంచంద్రారెడ్డా? అనే గందరగోళం నెలకొంది. దీని మీద రాష్ట్ర, కేంద్ర వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. మూడుజుల క్రితమే చనిపోయినట్లు విడుదలైన ఆ వీడియో అసలు ఎప్పటిది? నిర్ధారణ కానీ ఈ ప్రశ్నలు కేంద్ర నిఘా వర్గాలతో పాటు మావోయిస్టు క్యాడర్ లో కలకలం రేపుతున్నాయి. చనిపోయింది 46 ఏళ్ల అజ్ఞాతవాసంలో మావోయిస్టు పార్టీ ఆశయాలను, ఉద్యమాన్ని బలోపేతం చేసి, సికాస (సింగరేణి కార్మిక సంఘం)ను ఏర్పాటు చేసిన మల్లా రాజిరెడ్డి అనే ప్రచారం శుక్రవారం సాయంత్రం వరకు జరగగా, ఆ తరువాత మల్లారెడ్డి కాదు, రాంచంద్రారెడ్డి చనిపోయారంటూ కొత్త ప్రచారానికి తెరలేచింది.
ఆ రెండు కుటుంబాలకూ తెలియదు
అయితే, ఈ అంశం మీద మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఈ రెండు కుటుంబాలవారికి కూడా ఏ విషయమూ తెలియకపోవడంతో, అసలు దండకారణ్యంలో ఎవరైనా చనిపోయిది వాస్తవమా.? కాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే క్రమంలో కేంద్ర నిఘా వర్గాలు సైతం దీని గురించి ఆరా తీసే పనిలో పడిపోయాయి. రాజిరెడ్డి చనిపోయినట్లు లీకు ఇచ్చిందెవరు? ప్రస్తుతం రాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి ఏ ప్రాంతంలో ఉన్నారో అనే అంశాలపై ఆరా తీస్తున్నాయి. ఇటు ఇరువురు నేతల ఇళ్లకు వచ్చి వెళ్తున్న వారితో పాటు కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. గతంలో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా, మరో అగ్రనేత హరిభూషణ్, రామన్న చనిపోయారంటూ ఇదే తరహాలో ప్రచారం జరిగింది. దీంతో వారు చనిపోయినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని, వారందరూ బతికే ఉన్నారంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ అప్పట్లో లేఖలు విడుదల చేసింది. మరో అగ్రనేత ఆర్కే చనిపోయినప్పుడు మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. బీజాపూర్ లో చనిపోయినట్లు వస్తున్న వార్తలపై మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి మృతిపై సస్పెన్స్ కొనసాగుతోంది.