Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సీసా పాలు వద్దు, తల్లి పాలు ముద్దు

No bottle milk, feed breast milk

0

ఇప్పటికీ ఈ సూపర్ ఫాస్ట్ జనరేషన్ లో కూడా ఎంతో మందికి తల్లి పాల ప్రాముఖ్యత మరియు ప్రసవం అయిన మొదటి గంటలో ఇచ్చే ముర్రుపాల లో ఉండే పోషకాల విలువ తెలియక పిల్లలను పోషకాహార లోపంతో పెంచుతుంటారు . అలాంటి లోపాలు లేకుండా తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు డాక్టర్ . దీప్తి . వి వారి మాటల్లోనే తల్లి పాల ప్రాముఖ్యత తెలుసుకుందాం .

సిజీరియన్ లోనే కాదు, సాధారణ కాన్పులో కూడా వెంటనే పాలు ధార కట్టవు. కానీ, పుట్టిన మొదటి గంటలోపు బిడ్డకు తల్లి రొమ్ము పట్టించాలి. ఒక్కో చుక్క వచ్చినా ముర్రుపాలు అమృతతుల్యం. బిడ్డకు అది మొదటి టీకా లాంటిది .బిడ్డ రొమ్ము చీకడం వల్ల పాల ఉత్పత్తి త్వరగా జరుగుతుంది. తల్లి పురిటి నొప్పులకు కూడా కాస్త ఉపశమనం దొరుకుతుంది. బిడ్డకు తల్లి స్పర్శ వెచ్చదనం దొరుకుతుంది.

ఆపరేషన్ తర్వాత తల్లి వెల్లికిలా పడుకొని ఉంటుంది కాబట్టి బిడ్డ పాలు తాగడానికి అనువుగా ఉండదు అనుకుంటారు కానీ ఆపరేషన్ అయితే కనీసం గంటకోసారి అయినా తల్లి ఎదపై బోర్లా పడుకోబెట్టి మరొకరి సహాయంతో పాలు పట్టొచ్చు. కాస్త నొప్పి, ఇబ్బంది తప్పవు. సాధారణ కాన్పు అయితే ఆ తల్లులు కాన్పు తర్వాత మెత్తని బట్టలో చుట్టిన బిడ్డను తల్లి ఛాతీ పైన బోర్లా పడుకోబెట్టుకొని పాలివ్వాలి .

చాలా మంది తల్లులకు ఉండే సమస్య..
చనుమొనలు సరిగ్గా లేకపోవడం.దీని వలన చాలా మంది తల్లులు అవగాహనా లోపంతోనో , సిగ్గు గా భావించో తల్లికి పాల ఉత్పత్తి సరిగ్గా ఉన్నా బిడ్డ రొమ్ము పట్టడంలేదని, సునాయాసంగా ప్రత్యామ్నాయ మార్గం సీసా తో పాలు పట్టడం ఎన్నుకుంటారు . ఇక్కడ తల్లికి కావలసిందల్లా ఓపిక. కొన్ని సులభమైన టెక్నిక్ లతో అలాంటి చనుమొనల్ని బిడ్డ పట్టడానికి అనువుగా సరిచేయవచ్చు. ఎప్పుడైనా బిడ్డ తల్లి పాలు తాగితే ఎక్కువ సమయం నిద్ర పోతారు . మొదటి రెండు నెలల్లో బిడ్డకు ప్రతి రెండు గంటలకొకసారి పాలు పట్టాలి . నెలలు నిండే కొద్దీ పాలిచ్చే నిడివి కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. సిజేరియన్ అయింది కాబట్టి తల్లికి రెస్ట్ కావాలి అని రాత్రిళ్లు సీసా పాలు పట్టే వారున్నారు. రాత్రిళ్లు పాలు ఇవ్వడం వల్ల తల్లి మెదడు నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ స్రవిస్తుంది.దీని వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది .

బిడ్డ బరువు తక్కువగా ఉంటే లేదా
అనారోగ్యంగా ఉంటే వారికి తల్లి పాలు అవసరమైతే పిండి ఇవ్వడం ఎంతో అవసరం. ఈ సమయంలో తల్లి పాలే బిడ్డకు అన్నింటికంటే ముఖ్యమైన మందు గా పని చేస్తుంది . సాధారణంగా తల్లి దగ్గర పిండిన పాలు గది ఉష్ణోగ్రతలో 6 గంటలు, సాధారణ ఫ్రిడ్జిలో ఒకరోజు పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు పిండి ఉంచిన పాలు ఉగ్గు గిన్నె సాయంతో పట్టొచ్చు. సీసాతో పట్టే విధానానికి స్వస్తి పలకడం మేలు .

మరో అత్యంత ముఖ్యమైన సమస్య పాలు పడకపోవడం
అసలు పాలు పడకపోవడం అనేది ఉండదు . కొందరిలో తీవ్ర రక్తహీనత, కాన్పు సమయంలో అతిగా రక్తస్రావం, అధిక రక్తపోటు, ఏదైనా మానసిక అనారోగ్యం లాంటివి ఉంటే పాలు రాకపోవచ్చు. ఈ సమయంలో కొందరికి కొన్ని రకాల మందుల వలన పాలు పడే అవకాశం ఉంటుంది . అప్పటికీ పాలు పడని తల్లులు డాక్టర్ సూచించే పాల పౌడర్ కి ప్రాధాన్యం ఇవ్వాలి . దాని వలన బిడ్డకు అవసరమైన పోషకాలు ఎంత పాళ్ళలో ఉండాలో అలా ఉంటాయి. రోగనిరోధక శక్తి విషయంలో తల్లి పాలకు ఇవి సాటి రావు . వీలైనంత వరకు బిడ్డలకు సీసాలతో కాకుండా ఉగ్గు గిన్నె తో పాలు పట్టేలా చూసుకోవాలి.

పాలిచ్చే తల్లులు ప్రతి రోజు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి . పాలు , గుడ్లు , చేపలు నిస్సందేహంగా తీసుకోవచ్చు. ఆహారం విషయంలో ఏదైనా తాజాగా, వేడిగా, ఇంట్లోనే తయారుచేసినదై తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బలు, పాలు, పండిన బొప్పాయి, మాంసం పాల ఉత్పత్తికి ఎంతో మంచిది.చాలా మంది తల్లులు అవగాహనా లోపంతో పప్పు తినకూడదని, నీరు ఎక్కువ తాగొద్దని , పాలు తాగొద్దని వాటిని తీసుకోరు దాని వల్ల బిడ్డకు కడుపులో మంట, మలబద్ధకం వస్తాయి. బిడ్డకు కడుపునొప్పి కూడా వస్తుంది .బిడ్డకు ముఖ్యంగా ఆహారంగా మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే . ఆరు నెలల తర్వాత పై ఆహారం ఇస్తూ రెండేళ్ల వరకూ పాలు కొనసాగించవచ్చు. తల్లి పాలు తాగే పిల్లల్లో మెదడు పనితీరు కూడా చురుకుగా ఉంటుంది. అధిక బరువు, స్థూల కాయం కూడా ఉండవు.

సాధారణ జలుబు మొదలుకొని హెచ్. ఐ. వి. ఇన్ఫెక్షన్ , కరోనా లాంటి జబ్బులు ఉన్నా బిడ్డకు తల్లి పాలు పట్టకూడదు అనేది అపోహ మాత్రమే ఇలాంటి వారు డాక్టర్ సలహాలు , సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలతో బిడ్డలకు పాలు పట్టించొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. తప్పని పరిస్తితులలో గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువ. అందువల్ల కేలరీలు తక్కువ. వంద గ్రాములు ఆవు పాల కేలరీలు వంద గ్రాముల తల్లి పాల కేలరీలతో సమానం. అయినా తల్లి పాల ప్రాముఖ్యత వేరు . బిడ్డలకు తల్లి పాలను పట్టించండి వ్యాధుల భారీ నుండి కాపాడండి .

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie