విజయవాడ, ఫిబ్రవరి 22:ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24న ఆయన రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. జస్టిస్ అబ్దుల్ నజీర్ సతీసమేతంగా ఆయన దిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి రానున్నారు. ఈ నెల 24న రాష్ట్ర మూడో గవర్నర్‌గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మూడో న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ గుర్తింపు పొందారు. ఈ ఏడాది జనవరిలోనే ఆయన పదవీ విరమణ చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ ట్రిపుల్ తలాక్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్నారు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులు అయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. ఏపీతో పాటు మొత్తం 12 మంది కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. వీరికి రాష్ట్రపతి ఇటీవల ఆమోదం తెలిపారు.
ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్ బైస్ నియమితులు అయ్యారు. ఇప్పటివరకు ఈయన ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. మహారాష్ట్రకు ప్రస్తుత గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఏపీకి కొత్త గవర్నర్ గా నియమితులు అయిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో పుట్టారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తర్వాత 2003లో కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ రానున్న వేళ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.
విజయవాడలోని బందరు రోడ్డులోగల ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గవర్నర్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తనపట్ల చూపిన గౌరవం, ఆప్యాయత మర్చిపోలేనని గవర్నర్ మాట్లాడారు. ఏపీ ప్రజలు అందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. గవర్నర్, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన రెండో ఇల్లు లాంటిదని అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మర్చిపోబోనని అన్నారు. తాను గవర్నర్ గా ఏపీకి వచ్చిన కొత్తలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని జగన్ ను ప్రశ్నించానని, దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్ చెప్పారన్నారు.