నెల్లూరు నగర పాలక సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది. కమిషనర్ వికాస్ మర్మత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెవెన్యూ విభాగంలో ఆ ముఖ్య అధికారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కమిషనర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ అధికారి దానిని అలుసుగా తీసుకుని తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అది పరాకాష్టకు చేరింది. ఎంతవరకు వెళ్లిందంటే కమిషనర్ పరోక్షంలో అంతర్గత బదిలీల వరకు వెళ్లింది. సాధారణంగా కార్పొరేషన్‌లో అంతర్గత బదిలీలు చేయాలంటే తొలుత కమిషనర్‌తో చర్చించాలి. అనంతరం ఫైల్ సిద్ధం చేసి ఆయనకు పంపాలి.
అయితే ఆ అధికారి ఎక్కువ చనువు తీసుకుని ఇటీవల వివిధ విభాగాల సూపరింటెండెంట్లను బదిలీ చేయాలని ఫైల్ సిద్ధం చేశారు. ఇక ఎన్నికల సీజన్ వస్తుందని భావించిన ఆ సూపరింటెండెంట్లు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని భావించి ఆ ముఖ్య అధికారిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకోవడంతో ఆయన హడావిడిగా అందుకు సంబంధించిన ఫైల్ సిద్ధం చేయించినట్లు తెలిసింది.ఈ విషయం అకౌంట్స్ విభాగంలో సూపరింటెండెంట్‌కు తెలిసి కమిషనర్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుని వచ్చినట్లు సమాచారం. ఆమె చెప్పిన సమాచారం విని కమిషనర్ ఒక్కసారిగా విస్తుపోయినట్లు సమాచారం.
తనకు తెలియకుండానే కార్యాలయంలో ఇంత జరుగుతోందా అని ఆయన విస్తుపోయారట. అకౌంట్స్ విభాగం అధికారిణి చెప్పినట్లుగానే అంతర్గత బదిలీల ఫైల్ కమిషనర్ వద్దకు చేరింది. ఆ ఫైల్ చూడటంతోనే కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ ఫైల్ సిద్ధం చేసిన రెవెన్యూ విభాగం ముఖ్యఅధికారిని పిలిచి క్లాస్ పీకినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆ అధికారి వ్యవహార శైలిపై అనేక విమర్శలున్నాయి. తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగులను వేధించడం వంటి చర్యలకు పాల్పడుతుంటారనే విమర్శలున్నాయి.
ఇటీవల కార్పొరేషన్ ట్రెజరీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఏదో ఒక విషయంలో ఒక సలహా ఇచ్చాడని ఆ అధికారికి ఇగో దెబ్బతిన్నది. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాకే సలహాలు ఇస్తావా అంటూ ఆ ఉద్యోగిని అక్కడి నుంచి బదిలీ చేయాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయన వ్యవహార శైలిపై లోతుగా విచారణ నిర్వహిస్తే మరిన్ని విశేషాలు, చేస్తున్న అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కమిషనర్ ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.