- రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- వాహనదారులపై కొరడా గులిపిస్తున్న కరీంనగర్ పోలీసులు
రోడ్డు నియమనిబంధనలు ఉల్లఘించే వాహనదారులపై కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. వాహనదారులు రోడ్డునియమనిబంధనలు పాటించకపోవడం వల్లనే ఎక్కువశాతం ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు నియంత్రణకు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రకాల వాహనాల నెంబర్లు కనిపించకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులు కొనసాగిస్తుండటంతోపాటు వాహనాల నెంబర్లను ట్యాంపరింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, పెద్దపెద్ద శబ్దాలు వచ్చేలా వాహనాలకు ఆదనపు సైలెన్స్ ర్లను బిగించి శబ్దకాలుష్యానికి కారణవుతున్న వాహనాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కారణం అవుతున్న వాహనదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపడం, అతివేగంతో వాహనాలు నడుపడం, త్రిబుల్ రైడింగ్ లకు పాల్పడుతున్న మైనర్లను అదుపులోకి తీసుకోవడం లాంటి చర్యలను కొనసాగించాలని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసు అధికారులను ఆదేశించిన విషయం విదితమే. ట్రాఫిక్ పోలీసులు గత 2 నెలల నుండి స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నారు.
ఈ-చలాన్ల నుండి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు వివిధ రకాల పద్దతుల్లో భాగంగా కొన్ని నెంబర్లుచిన్నగా, కొన్నినెంబర్లు జిగ్ జాగ్ గా, మరికొందరు వినియోగించని వాహనాల నెంబర్ ప్లేట్లను వాహనాలను పెట్టుకుని సంచరిస్తున్నారని, వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడిన వాహనాలు కూడా అప్పుడప్పుడూ రోడ్లపైకి వస్తున్నట్లు తమదృష్టిలోకి వచ్చిందని, ఇలాంటి స్పెషల్ డ్రైవ్ ల నిర్వాహణతో దొంగిలించబడిన వాహనాలు స్వాధీనం చేసుకునే అవకాశం లభించడంతోపాటు రోడ్డు నియమనిబంధనలను పాటించనివారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నారు. నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం, కొన్నినెంబర్లు చిన్నగా మరికొన్ని నెంబర్లు పెద్దవిగా(జిగాగ్) వాహనాలకు పెట్టుకుని రోడ్లపై సంచరించడాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ లు కొనసాగుతున్నాయి. వాహనాల ప్లేట్ నెంబర్లను ట్యాంపరింగ్ చేసి వాహనాలు నడిపేవారితోపాటు సదరు వాహనాలకు సంబంధించిన యజమానులపై కూడా క్రిమినల్ కేసులను నమోదుచేస్తామని హెచ్చరించారు. కమిషనరేట్ లోని వివిధపోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు తమపరిధిలో పైన పేర్కొన్న నమోదు చేసిన వివరాలను ఏరోజుకారోజు నివేదిక అందించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ పోలీసుల పరిధిలో
రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఈ సంవత్సరంలో జనవరి 01 నుండి ఈనెల 22(బుధవారం) వరకు రోడ్డునియమనిబంధనలను పాటించని వారిపై వివిధ రకాలకు చెందిన 47,293 కేసులను నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు 323 హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపడం 41, 622, అతివేగంతో వాహనాలు నడుపడం 1019, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 909, రోడ్లపై వాహనాలు నిలుపదల చేసి ట్రాఫిక్ నకు అంతరాయం కలింగించడం1877, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపడం 515, నెంబర్ ప్లేట్ల ట్యాపరింగ్ 58. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం 197, త్రిబుల్ రైడింగ్ 367, శబ్దకాలుష్యానికి కారమైన వాహనాలు 03 మైనర్ డ్రైవింగ్ 2 అతివేగంతో వాహనాలు నడిపడం, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకున్న వాహనదారులులతోపాటు వివిధ రకాల రోడ్డునియమనిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసులను నమోదు చేయడం జరుగుతున్నది.
ధృవపత్రాలను ఏర్పాటు చేసుకోవాలి
వివిధ రకాల వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా సదరు వాహనదారులు తమపేరిట వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలను ఇతరులకు విక్రయించిన సందర్భాలలో వారి పేరిటి రిజిస్ట్రేషన్ అయ్యేవిధంగా పత్రాలను రవాణాశాఖద్వారా రూపొందించబడిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. విక్రయాల సందర్భంగా ఎలాంటి ధృవపత్రాలు ఏర్పాటు చేసుకోనట్లయితే కొనుగోలు చేసిన వాహనదారులు ఎలాంటి చట్టవ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడినా వాహనాలను విక్రయించిన వారే ఇందుకు భాద్యులుగా భావిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాలలో తమపేరిట వాహనం రిజిస్ట్రేషన్ కలిగిఉన్నట్లైతే భీమాసౌకర్యం వర్తిస్తుందని, లేనట్లయితే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. నెంబర్ ప్లేట్ల మార్పులు, జిగ్ జాగ్ విధానంలో నెంబర్ పేట్లు రూపొందించుకుని వాహనాలకు బిగించడం లాంటి చర్యలు చట్టాన్ని ఉల్లఘించిన చర్యల కిందకు వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వాహనదారులు నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి: కరీంనగర్ సీపీ ఎల్ సుబ్బరాయుడు
రోడ్డు ప్రమాదాల నియంత్రణతోపాటు ట్రాఫిక్ నకు అంతరాయం కలుగడానికి కారణం అవుతున్న రోడ్డు నియమ నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకునే పక్రియ నిరంతరం కొనసాగుతుందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. వాహనదారులు రోడ్డు నియమనిబంధనలపై అవగాహన కలిగిఉండాలని చెప్పారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణీకులను కుటుంబసభ్యులతో సమానంగా చూడాలని చెప్పారు. మహిళలు అభద్రతాభావానికి లోనుకాకుండా చూసుకోవాలని కోరారు. ప్రతి ఆటోడ్రైవర్ లైసెన్సును కలిగిఉండటంతోపాటు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. ప్రమాదాల్లో ఇంటి పెద్దదిక్కు కోల్పేతే ఆ కుటుంబం వీధిపాలవుతుందని, వాహనాలు నడిపేప్పుడు కుటుంబసభ్యులను గుర్తుచేసుకోవాలని సూచించారు.
డ్రైవర్లు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకవచ్చిన హాక్ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. ప్రయాణీకుల భద్రతకు వివిధ ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ప్రాధాన్యతనివ్వాలని ప్రయాణికులను అతిధులుగా భావించి మర్యాదగా ప్రవర్తించినట్లయితే డ్రైవర్లపై గౌరవం పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా డ్రైవర్ పక్కన ఏర్పాటు చేసిన అదనపు సీట్లను, వాహనాల్లో ఏర్పాటు చేసిన ఆడియో రికార్డలను శబ్ధకాలుష్యం నివారణకు తొలగిస్తున్నామని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి వ్యక్తుల మృతికి కారకులైనట్లయితే సదరు వాహనదారులపై హత్యానేరంతో సమానమైన నేరాలను నమోదు చేస్తామని హెచ్చరించారు.