రాజకీయ బిక్ష పెట్టిన మీ రుణం తీర్చుకుంటా: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
Political beggars will repay your debt MLC Kadiam Srihari
1994లో రాజకీయ బిక్ష పెట్టిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా వెలువడనున్న నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రత్యేకత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994, 1999, 2008 ఎన్నికల్లో ఆశీర్వదించిన మీరు 2014లో ఎంపీగా, 2015, 2021లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు తల వంపులు తేకుండా నీతి, నిజాయితీగా పనిచేశానన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను పేదల కష్టసుఖాలలో పాలుపంచుకునేందుకు కృషి చేశాను తప్ప అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించలేదన్నారు. పార్టీ, పార్టీ అధినేత తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని అవకాశం ఇస్తే మీ ఆశీర్వాద బలంతో గెలిచి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు.
పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో గతాన్ని గడిచిన తొమ్మిదేళ్లతో పోల్చుకుంటే జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు ఉందన్నారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి మరో మారు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి మొదలైన పథకాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే కాంగ్రెస్, బిజెపి పార్టీల వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నించాలన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బెలీద వెంకన్న, బుర్ల శంకర్, పోగుల సారంగపాణి, గన్ను నరసింహులు, నీరటి ప్రభాకర్, నీల గట్టయ్య, పెసరు సారయ్య, గోనెల ఉపేందర్, డాక్టర్ జైహింద్, రెడ్ల సోమయ్య, స్వామి నాయక్, రాజేష్ నాయక్, ఎల్మకంటి నాగరాజు, జీడి రమేష్, జోసెఫ్, జీడి ప్రసాద్ వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.