స్టేషన్ ఘన్ పూర్: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లోకి ఎక్కే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో మరో సారి నోరు జారారు. అది ప్రచార మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ మండలం సముద్రాల క్లస్టర్ సమావేశం మంగళవారం సిరిపురం గార్డెన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి ప్రసంగం ముగిసిన అనంతరం ఎమ్మెల్యే ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినట్లు తెలిపారు. తన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అక్షయపాత్ర నియోజకవర్గ అభివృద్ధికి ఏది అడిగిన అధికంగా ఇచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అన్నారు. ‘అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్.. ముందు చూసినా బీఆర్ఎస్.. అటు చూసినా బీఆర్ఎస్.. ఇటు చూసినా బీఆర్‌ఎస్.. బీఆర్ఎసే.. కాంగ్రెస్’ అంటూ ఎమ్మెల్యే రాజయ్య ఆవేశపూరితంగా ప్రసంగిస్తూ నోరు జారారు. దీంతో ఆత్మీయ సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నాయకులు ఒకరినొకరు చూసుకుంటూ విస్మయానికి గురయ్యారు.