గుంటూరు, ఫిబ్రవరి 2: గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. మిర్చీ యార్డు నుంచి బైక్ పై వస్తున్న వ్యాపారిని చితకబాది ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. వ్యాపారస్తుల మధ్య లావాదేవీల్లో భాగంగా కిడ్నాప్ జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ కలకలంతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యాపారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.గుంటూరు నగరానికి చెందిన మిర్చీ వ్యాపారులు నరేంద్ర కుమార్, బర్మా వెంకట్రావుల మధ్య గత కొన్నేళ్లుగా లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నాయి. నరేంద్ర తనకు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని బర్మా వెంకట్రావు ఆరోపిస్తున్నారు. నరేంద్రకు మిర్చిని విక్రయించానని వాటి తాలూకా తనకు డబ్బులు రావాలని వెంకట్రావు వాదన. దీనిపై పోలీస్ స్టేషన్లలో నరేంద్ర ఫిర్యాదు కూడా చేశాడు. మరోవైపు వెంకట్రావు వద్ద నుంచి డబ్బులు రావాల్సిన మిర్చీ రైతులు కూడా పోలీసులకు కంప్లయింట్ చేశారు. వెంకట్రావు మాత్రం తనకు నరేంద్ర డబ్బులివ్వాలని అవి రాగానే చెల్లిస్తానంటూ చెబుతూ వచ్చాడు. ఇదే విషయం మిర్చీ యార్డులోని పెద్దల వద్ద కూడా పంచాయితీ జరిగింది. ఎన్ని చోట్లకు వెళ్లిన ఇద్దరి మద్య ఉన్న సమస్య పరిష్కారం కాలేదు.
ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో మిర్చి యార్డు నుంచి బైకుపై వస్తున్న నరేంద్రను ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు దుండగులు అడ్డుకున్నారు. నలుగురు దుండగులు నరేంద్రను కొట్టి ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన బంధువులు హుటాహుటిన యార్డు వద్దకు వచ్చారు. మిర్చి యార్డు నుంచి కిలో మీటర్ దూరంలోనే కిడ్నాప్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే వ్యాపారులు మిర్చి యార్డు వద్ద ఆందోళనకు దిగారు. వ్యాపారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిందుతుల వద్ద నుంచి వ్యాపారిని క్షేమంగా కాపాడాలని డిమాండ్ చేశారు. మిర్చి యార్డు నుండి వస్తున్న తన తండ్రిని కిడ్నాప్ చేసినట్లు నరేంద్ర కొడుకు చైతన్య పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కిడ్నాపర్లను పట్టుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.