ఖమ్మం ఫిబ్రవరి 7: దమ్ముంటే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి. అని పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పువ్వాడ పాల్గొని ప్రసంగించారు.బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ద్వారా గెలిచి పొంగులేటికి వంత పాడుతున్న నేతలంతా తక్షణమే రాజీనామా చేయాలి అని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న వారంతా కేసీఆర్‌కు విధేయులే. నా బ్రాండ్ నా గ్రూప్ అంటే కుదరదు అని పువ్వాడ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్.. పొంగులేటి లాంటి వ్యక్తులను రాష్ట్రంలో ఎంతో మందిని చూశారు.
పార్టీ శాసనసభా పక్షాన్ని 2009లో చీల్చే ప్రయత్నం చేసినప్పుడే కేసీఆర్ చలించలేదు అని గుర్తు చేశారు.కేసీఆర్ నీడ నుంచి వెళ్లిన వారికి రాజకీయ జీవితం లేకుండా పోయింది. కేసీఆర్ తయారు చేసిన నాయకులు చాలా పెద్దవాళ్లం అనుకుంటున్నారు. ఒక్కసారి కేసీఆర్ చేయి వదిలేస్తే వారి గతి అధోగతే అని హెచ్చరించారు. కొందరు పార్టీలు కూడా పెట్టారు. ఆ పార్టీలు పాన్‌డబ్బాలుగా మారిపోయాయని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ, తెలంగాణలో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ మాత్రమే జాతీయ పార్టీలను తట్టుకుని నిలబడ్డాయి. మిగతా పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.బీ ఫామ్ ఇవ్వాలని తాను ఏ ఒక్క రోజు కూడా అడగలేదు.
మీరంతా తన కుటుంబ సభ్యులే అని స్పష్టం చేశారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఏ ఒక్క రోజు కూడా తన స్వార్థం కోసం రాజకీయాలు చేయలేదు. తన నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కుంపటి పెడుతామనడం సరికాదు. ప్రతి నాయకుడు పార్టీ విధానాల ప్రకారం నడుచుకోవాలి. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తానే తీసుకుంటున్నానని మంత్రి స్పష్టం చేశారు. వైరాలో బీఆర్ఎస్ ఎట్ల గెలవదో తాను చూస్తానని చెప్పారు. గ్రూపు రాజకీయాలు మంచివి కావు. కేసీఆర్ఎవరికీ అన్యాయం చేయకుండా అందరికీ పదవులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి మన కళ్ల ముందు కనబడుతుంది. ఎవరో కేసీఆర్‌కు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.