ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అహింస మార్గాన్ని నమ్ముకుని అడవుల్లో తిరుగుతున్న అన్నలు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని జిల్లా ఎస్పీ వినీత్ జి అన్నారు. గురువారం చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేస్తూ అజ్ఞాతంలో ఉన్న 16 మందికి చెందిన కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యారు. చర్ల మండలంలోని ఎర్రంపాడు,కొండవాయి,కిష్టారంపాడు,బట్టిగూడెం,రాళ్లపురం, బూరుగుపాడు, చెన్నాపురం, కొరకట్ పాడు మరియు అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామాల నుండి ప్రస్తుతం నిషేధిత మావోయిస్టు పార్టీలో చేరి అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్న వారి కుటుంబ సభ్యులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్ల మండలంలోని ఏజెన్సీ గ్రామాలలో నివసించే అమాయకపు ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా నిషేధిత మావోయిస్టు పార్టీలో చేర్చుకుని నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం వారి చేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని అన్నారు.తెలిసి,తెలియక కొంతమంది అజ్ఞాతంలోకి పోయి తిరిగి జన జీవన స్రవంతిలో కలవడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.తమ కుటుంబ సభ్యుల ద్వారా గాని,బంధుమిత్రుల ద్వారా గానీ సమీప పోలీస్ స్టేషన్ లేదా నేరుగా ఎస్పీ కార్యాలయంలో గానీ పోలీసులకు లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల సౌకర్యాలను అందిస్తామని తెలిపారు. గతంలో జిల్లా నుండి 28 మంది మావోయిస్టు పార్టీలో పనిచేశారని,ఇప్పుడు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారని,వారిని కూడా నిషేధిత మావోయిస్టు పార్టీ నుండి బయటకు తీసుకువచ్చి సాధారణ జీవనం గడిపే విధంగా చేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని అన్నారు.
వలస ఆదివాసీలు నివసించే గ్రామాలకు వివిధ రకాల పథకాలను అందిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు,విద్య,వైద్యం వంటి సౌకర్యాలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టులకు ఎవరైనా సహాయ సహాకారాలు అందిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్,చర్ల ఇన్స్పెక్టర్ అశోక్,అశ్వాపురం సిఐ శ్రీనివాస్,ఎస్సైలు వెంకటప్పయ్య,సూరి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.