ఏపీ ప్రభుత్వంపై ప్రజలపై రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమవుతున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలోనే మూడు దఫాలుగా ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేయడానికి అనుమతించడంపై పెద్ద ఎత్తున పోరాడాలని నిర్ణయించాయి.రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలకు అదనపు వసూళ్లను జోడిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్షాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి. ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల పెంపును ప్రతిఘటించాలని వామపక్షాల రాష్ట్ర సదస్సులో నిర్ణయించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతును భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు.
ఈ నెల 30వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాలు లేదా సబ్‌స్టేషన్‌ల వద్ద ధర్నాలు చేపట్టాలని, జిల్లాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలతో పాటు, సంతకాల సేకరణ, శాసన సభ్యులకు మెమోరాండాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.విద్యుత్ చార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో సదస్సు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, ప్రధాన తీర్మానాన్ని సదస్సు ముందు ప్రతిపాదించారు. కేంద్రప్రభుత్వానికి సిఎం జగన్ మద్దతు పలకుతూ ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్నారని విమర్శించారు.
బిజెపి పాలిత రాష్ట్రాలే అమలు చేయని విద్యుత్ సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను ఏపీలో అమలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రపంచ బ్యాంకు షరతులకు చంద్రబాబు నాయుడు తలొగ్గి విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ఇప్పుడు కేంద్రప్రభుత్వం షరతులకుజగన్ తలొగ్గారని తెలిపారు.ఏపీలో మోడీ, జగన్ కలిసి కొత్త రూపాల్లో భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల భారం భరించలేక చిన్న పరిశ్రమలు, చేతివృత్తిదారులు దివాళా తీశారని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ పంపుసెట్లకుమీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడి ప్రభుత్వం ఇప్పుడు మీటర్లను బిగిస్తున్నదని ఆరోపించారు.కేంద్రం తీసుకొచ్చే సంస్కరణల వల్ల పెట్రోల్, డీజిల్ చార్జీలు రోజువారీ ఎలా వడ్డిస్తున్నారో విద్యుత్ చార్జీలు కూడా అలానే మోపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభ దశలోనే వీటినితిరస్కరిస్తే ప్రజలపై భారాలు పడవని చెప్పారు. పార్టీలకు అతీతంగా విద్యుత్ భారాలపై పోరాటాలు నిర్వహించాలని కోరారు. అప్పుడే ప్రభుత్వం భారాలపై వెనకడుగు వేస్తుందన్నారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్రంలోని ఎంపిలకు వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల అమలు చేసేందుకు జగన్‌కు ఎందుకంత ఉత్సాహమని ప్రశ్నించారు . అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు మోపనని ఇప్పటి వరకు సుమారు రూ.50వేల కోట్ల భారాలను ప్రజలపై మోపారని తెలిపారు. ఈ భారాలను ఎందుకు మోపారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం గజదొంగలాగా పట్టపగలే ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా మార్కెట్‌లో అధిక ధరకుకొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. అదానీ కంపెనీతో కుమ్మకయ్యారని, ట్రాన్స్‌మిషన్ల మరమ్మత్తులు చేసే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు స్మార్ట్‌మీటర్ల టెండర్ అప్పగించారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.17వేల కోట్ల భారాలు ప్రజలపై మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చండీఘర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రూ.10వేల లోపు ఉన్న స్మార్ట్‌మీటర్‌ను ేపీలో రూ.37వేలతో ఎందుకు కొనుగోలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారుసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రతిపాదించిన తీర్మానాలను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
సర్దుబాటు చార్జీల విధానమే రద్దు చేయాలని, ట్రూఅప్, సర్దుబాటు చార్జీల వసూళ్లు నిలిపివేయాలని తీర్మానించింది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను ప్రభుత్వాలు విరమించాలని, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెట్టద్దని డిమాండ్ చేసింది.ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎస్సి,ఎస్టి, బిసి, వృత్తిదారులకు అన్ని రకాల రాయితీలు సంపూర్ణంగా అమలు చేయాలని తీర్మానించింది. గృహ వినియోగదారులందరికీ 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది.
విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది.అదానీతో సహా వివిధ కార్పొరేట్ సంస్థలతో చేసుకున్న అడ్డగోలు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని తీర్మానించింది. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విద్యుత్ సంస్కరణలను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2022 ప్రతిపాదనలను ఉపసంహరించాలని తీర్మానించింది. ఈ కోర్కెల సాధనకై ఐక్యంగా ఉద్యమం సాగించాలని పిలుపునిచ్చింది.