- అదే నిజమైతే విజయసాయిరెడ్డి ఊరుకునేవారా..!?
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్
హైదరాబాద్ ఫిబ్రవరి 20: ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అయ్యో పాపం ఇలాజరిగిందేంటి..? అని అందరూ జాలి పడుతుంటారు. ఇంకొందరైతే.. చావు అనేది ఎంత పగవాడికైనా సరే రాకూడదని కోరుకుంటారు. కానీ చావును రాజకీయం చేయడం, పంచాయితీలు పెట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. టాలీవుడ్ సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న కన్నుమూశారని ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న మరణం సినీ, రాజకీయ వర్గాలను విషాదంలోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. ఎంతో భవిష్యత్ ఉన్న తారకరత్న ఇంత చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో అటు సోషల్ మీడియాలో వైసీపీకి (చెందిన కార్యకర్తలు కొందరు తారకరత్న మృతిపై చిల్లర మల్లరగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మీడియాలో కనిపించాలని అనుకున్నారో లేకుంటే ఎప్పటిలాగే నందమూరి, నారా కుటుంబ సభ్యులపై విమర్శించాలని అన్నారో కానీ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి.. తారకరత్న మృతిపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇంతకీ ఆమె ఏమన్నారు..!?
తారకరత్న మృతి చాలా బాధాకరమైన విషయం అని అంటూనే ఇక తన నోటికి పని చెప్పారు లక్ష్మీ పార్వతి. ‘తారకరత్న ఎప్పుడో చనిపోయాడు. కేవలం నారా లోకేష్ కోసం, స్వార్థం కోసం ఎక్కడ తన (నారా చంద్రబాబు) కుమారుడికి చెడ్డపేరు వస్తుందో అని ఇన్ని రోజులు దాచిపెట్టారు. తారకరత్న ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు అలాగే ఉంచారు. ఏమిటీ దుర్మార్గం.. ఈ రాజకీయాలకు అంతం లేదా అని నాకు అనిపిస్తోంది. ఆ అబ్బాయి చనిపోయాడని అప్పుడే డాక్టర్లు చెప్పారు. గుండె ఆగిపోయిందని చెప్పినప్పుడే అందరికీ అర్థమైపోయింది.
వారి స్వార్థం కోసం ఈ విషయాన్ని దాచిపెట్టారు. ప్రజలంతా ఎక్కడ అపశకునంగా భావిస్తారో అని బయటపెట్టలేదు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త అప్పుడే ప్రకటించి ఉండాల్సింది. నారా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ అపశకునమే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా.. దాచిపెట్టినా ప్రజలందరికీ అసలు విషయం అర్థమైపోయింది. గుండెను పిండేస్తోంది.. ఆ బాధ ఏంటో తారకరత్న కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఆయన భార్య, పిల్లలు ఎంత అల్లాడిపోయి ఉంటారో తలచుకుంటేనే బాధేస్తోంది. ఇలాంటి విషయాన్ని కూడా తన రాజకీయ పబ్బానికి వాడుకునే దుర్మార్గం చంద్రబాబు), లోకేష్‌కే తెలుసు. ఈ నీచ రాజకీయాలకు ఎప్పుడు స్వస్తి పలుకుతుందో అప్పుడే మా నందమూరి కుటుంబం బాగుపడుతుంది’ అని లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమె కామెంట్స్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లక్ష్మీపార్వతి కామెంట్సే వైరల్ అవుతున్నాయి.