రాను రాను మోబైల్ చేతికొచ్చి ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చాక.. టీవీ, సినిమా, ఓటీటీ, వార్తలు, పత్రికలు, మ్యాగజైన్స్, గేమ్స్, ఆన్లైన్ షాపింగ్.. ఇలా ఏ అంశమైనా ఫోనే అయిపోయింది. దీంతో పుస్తక పఠనం పూర్తిగా పడిపోయింది. అన్నీ మొబైల్‌లోనే లభించే అవకాశాన్ని సాధించడం మనిషి సాధించిన సాంకేతికతకు ఓవైపు అద్దం పడుతుంటే.. మరోవైపు దానివల్ల చూపుకు, జ్ఞాపకశక్తికి, రేడియేషన్ తో ఏర్పడే శారీరక సమస్యలకు.. పిల్లలపై ప్రభావానికీ మొబైల్ వల్లే అంతే అనర్థాలనూ సమాంతరంగా చూస్తున్నాం. ఈ క్రమంలో పుస్తక పఠనం విలువ ఇప్పుడు మరోసారి డిబేటబుల్‌గా మారింది. ఈ అంశాన్నే కొలమానంగా తీసుకుని Telangana State Government Libraries తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలను మరోసారి తెరపైకి తెచ్చింది. అందులో పుస్తక పఠనంతో పాటు.. పూర్తిగా వైఫై కనెక్టివిటీతో డిజిటల్ లైబ్రరీలను తెరపైకి తేవడం అభినందించాల్సిన విషయం.అయితే, ఇప్పటివరకూ మనం చూసిన ఎన్నో లైబ్రరీలు కేవలం మగవారు మాత్రమే స్వేచ్ఛగా వెళ్లి చదువుకునేలా ఉండేవి. కానీ, అందుకు భిన్నంగా ఇప్పుడు మహిళల కోసం కూడా ప్రత్యేక గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తోంది.
అందులో భాగంగా కరీంనగర్ జిల్లా రాంనగర్ కేంద్రంగా.. మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన మహిళా గ్రంథాలయం ఇప్పుడు చెప్పుకోవాల్సిన ఓ ప్రగతిశీల అంశం. ఈ లైబ్రరీకి ఇప్పుడు చుట్టుపక్కల మహిళలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మహిళలకు కావల్సిన అన్ని వసతులతో పాటు.. సావిత్రీభాయి పూలే, సరోజిని దేవీ, కల్పనా చావ్లా నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా, సూపర్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవీ వరకు ఎన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. అంతెందుకు.. మహిళలకిష్టమైన వంటలు, కుట్లు, అల్లికలు, గార్డెనింగ్, ఆరోగ్య సూత్రాలు, బ్యూటీషియన్ బుక్స్ తో పాటు.. నవలలు, చారిత్రక పుస్తకాల వంటివీ ఉంచడంతో చాలామంది మహిళలు.
తమ కుటుంబ పనులు ముగించుకుని కరీంనగర్ లో లైబ్రరీ బాట పట్టడం.. మహిళా సాధికారత సాధించాలనుకునే క్రమంలో ఓ ప్రోగ్రెసివ్ డెవలప్ మెంట్.అయితే, మొట్టమొదటి మహిళా లైబ్రరీని కరీంనగర్ వేదికగా ప్రారంభించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని గ్రామగ్రామానికీ విస్తరించాలనుకుంటోంది. కరీంనగర్ లో ప్రస్తుతం మహిళాసంఘ భవనంలో నిర్వహిస్తున్న ఈ లైబ్రరీని.. ఐదు గదులతో.. పూర్తి స్థాయి ఫర్నీచర్ తో కోటి ఐదులక్షల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతీనెలా వార్తాపత్రికలు, ఇతర మ్యాగజైన్స్ కోసం ప్రతీ రీడింగ్ రూమ్ కు ఒక రెండు వేల బడ్జెట్ నూ కేటాయిస్తున్నారు. ఇదే పద్ధతిలో గ్రామాల్లో గ్రామపంచాయతుల ఆధ్వర్యంలో ఇలాంటి Women’s Open Libraries మహిళా ఓపెన్ లైబ్రరీస్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.