ఉత్తరఖాండ్‌లో కేదార్‌నాథ్ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్లి దర్శించుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఇటీవలే ఈ యాత్ర మొదలైంది. అయితే ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాల తీవ్రత ఎక్కవయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఉత్తరఖాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కేదార్‌నాథ్ యాత్రను తాత్కలికంగా నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు జారీ చేసేవరకు యాత్రకు వచ్చేవారని ఎవరిని కూడా అనుమించవద్దని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.
అయితే ఇప్పటికే కేదార్‌నాథ్ యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులను అధికారులు సోన్‌ప్రయాగ ప్రాంతం వద్దే అడ్డుకున్నారు. అలాగే వారు ఉండేందుకు తాత్కలిక ఏర్పాట్లు కూడా చేసినట్లు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్ దీక్షిత్ వెల్లడించారు. అంతేకాదు కేవలం కేదార్‌నాథ్, రుద్రప్రయాగ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వీటి ప్రభావంతో వరదలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు అధికారులు వర్షాలు పడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ఆదేశించారు