రేపు మెదక్ రానున్న కేసిఆర్ సిద్ధమవుతున్న సభా వేదిక చకచకా సాగుతున్న ఏర్పాట్లు
KCR is coming to Medak tomorrow
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 23న మెదక్ రానున్నారు. నూతన కలెక్టర్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ భవన్ ప్రారంభించనున్నారు. సిఎస్ఐ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. టిఆర్ఎస్ భవన్ తో పాటు కలెక్టరేట్ సముదాయం ఎస్పీ కార్యాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కేటాయించిన గదుల్లోకి శాఖలు తరలివచ్చాయి. రెండు నూతన భవనాల ముందు ప్రాంగణాల్లో పచ్చదనం పరుస్తున్నారు. కెసిఆర్ పాల్గొనే బహిరంగ సభ స్థలి సిఎస్ఐ గ్రౌండ్లో వేదిక ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు మెదక్ పట్టణాన్ని గులాబీ మయంగా సుందరీకరిస్తున్నారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ప్రారంభోత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. భారీ బహిరంగ సభ విజయవంతం కోసం జన సమీకరణపై జిల్లా మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి దృష్టి సారించారు. పార్టీ ఇంచార్జిలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు రెండుసార్లు పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు.