మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
వామపక్షాలు అడిగిన స్థానాల్లోనూ బరిలోకి!
మును‘గోడు’ తీరాక పట్టించుకోని ముఖ్యమంత్రి
కనీసం అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వని సీఎం
సొంతంగా బరిలోకి దిగనున్న కమ్యూనిస్టులు?
ఆఖరిదాకా ఆశల పల్లకీలో ఊరేగిన వామపక్షాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఒక్కసారిగా షాక్ఇచ్చారు. ఇప్పటిదాకా తమతో పొత్తు ఉంటుందని భావించిన కమ్యూనిస్టులు సైతం బీఆర్ఎస్ తొలి జాబితాతో ఖంగుతిన్నారు. తాము అడిగిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో ఇక సొంతంగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్‌లు పెట్టిన కామ్రేడ్స్‌కు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోలేదు. జాబితా విడుదల కావడంతో తమను పక్కన పెట్టారని తేటతెల్లమైంది. నిజానికి మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టెక్కడానికి కేసీఆర్ వామపక్షాల మద్దతు తీసుకొని విజయం సాధించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వామపక్షాల మధ్య పొత్తు ఉంటుందని రెండు పార్టీలు భావించాయి. ఇటీవల జరిగిన వామపక్షాల సమావేశాల్లోనూ బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని కూడా ప్రకటించాయి.
తగ్గినా.. రానీయలే..!
మునుగోడు ఉప ఎన్నికకు ముందు కమ్మూనిస్టు నేతలకు ప్రగతిభవన్ గేట్లు తెరిచిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత ఒకటీ, రెండు సందర్భాల్లో మినహా వారిని పట్టించుకోలేదు. అయితే బీఆర్ఎస్తో దోస్తానా ఉంటుందని భావించిన సీపీఎం, సీపీఐలు ఖమ్మం, వైరా, మధిర, భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, కల్వకుర్తి నియోజకవర్గాలను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని కోరాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, కామ్రేడ్ల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇదే సందర్భంలో తమ అభ్యర్థనలకు కేసీఆర్ నుంచి సమాధానం రాకపోవడంతో కామ్రెడ్స్ కూడా కొంత డైలమాలో పడ్డారు. ఎక్కువ స్థానాలు కోరుతున్నామని భావించి చేరో నాలుగు సీట్లకు పరిమితమయ్యారు. వాటిని కూడా సీఎంకు పంపించినా అక్కడి నుంచి నో రిప్లై. ఇదే సమయంలో బీఆర్ఎస్తొలి జాబితాపై ప్రచారం జరిగింది. అనుకున్నట్టే సీఎం కేసీఆర్సోమవారం 115 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జాబితాలో వామపక్షాలు కోరిన స్థానాలు కూడా ఉన్నాయి.
ఎలక్షన్ హీట్ రగిలించిన బీఆర్ఎస్..
రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్‌లో షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అధికార పార్టీ ఒక్కసారిగా ఎన్నికల వేడిని రాజేసింది. విపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాట్లలోనే కొట్టుమిట్టాడుతున్నారు. కానీ కేసీఆర్7 సెగ్మెంట్లలో సిట్టింగ్‌లను మినహా పాతోళ్లందరికీ టికెట్లు కేటాయించారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం మొదలైనట్లుగా కనిపిస్తున్నది. ఇదే సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని సీపీఐ, సీపీఎం పార్టీలు చెప్పుకుంటూ వచ్చాయి. తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించుకోవలసి వస్తుందని కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే గతనెల సీపీఐ, సీపీఎంలు సంయుక్తంగా భేటీ నిర్వహించుకున్నాయి. తమకు చెరో పది సీట్లు అడగాలని, కనీసం చెరో ఐదు సీట్లు అయినా ఇచ్చేలా చూడాలని తీర్మానం చేశాయి. అలాగే బీఆర్ఎస్తో దోస్తీ ఉన్నట్లు కూడా ఇదే సందర్భంలో ప్రకటించాయి. ఇదే సందర్భంలోనే గెలిచే సత్తా తమకు లేకున్నా ఓడించే దమ్ము మాత్రం ఉందని, తమను తక్కువగా అంచనా వేస్తే బీఆర్ఎస్ కే నష్టం జరుగుతుందని సున్నితంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించి, తమతోనే కలిసి రావాలంటూ సూచించాయి.
ఆ ఎనిమిది కూడా ఇయ్యలే..
ఎక్కువ సీట్లు కోరుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల నుంచి టాక్ రావడంతో వామపక్షాలు సీట్ల సంఖ్యను తగ్గించాయి. చివరకు చెరో నాలుగు స్థానాలకు పరిమితమయ్యాయి. కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరింది. అదే విధంగా ఖమ్మం, పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలను సీపీఎం అడిగింది. కానీ, వీటిని బీఆర్ఎస్అధినేత పరిగణలోకి తీసుకోలేదు. సీట్ల కేటాయింపులపై ప్రచారం జరుగుతుండడంతో వామపక్షాలు ఆదివారం వరకు కూడా తమకు పిలుపు వస్తుందనే ఆశలో ఉన్నారు. కానీ కేసీఆర్‌నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. పైగా వామపక్షాలు కోరిన 8 స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపారు. దీంతో వామపక్షాలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి.