- తాండూరులో ఆచూకీ లభ్యం
- 12 గంటల్లో గుర్తించిన పోలీసులు
- స్వాదీనం చేసుకున్న అధికారులు
వికారాబాద్: కర్ణాటకలో చోరీ అయిన ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు ప్రాంతంలో లభ్యమైంది. బస్టాండ్లో నిలిపిఉన్న బస్సును గుర్తుతెలియని ఘనుడు ఎత్తుకెళ్లాడు. కర్ణాటక, తాండూరు పోలీసుల సహాకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీని కనిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చించొల్లి ఆర్టీసీ బస్టాండ్లో కేఏ 38 ఎఫ్971 నెంబర్ గల బస్సును ఉంచారు. మంగళవారం తెల్లవారు జామున 3-30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి బస్సును ఎత్తుకెళ్లాడు. గమనించిన సిబ్బంది గుల్బర్గా డీసీ వీరేష్కి సమాచారం అందించారు. దీంతో చించొల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు పోలీసుల సహాకారం కోరారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తాండూరు మండలంలోని భూకైలాస్ వద్ద చోరీ అయిన బస్సును గుర్తించారు.
వెంటనే కర్ణాటక, తాండూరు పోలీసులతో పాటు డీసీ, సిబ్బంది భూకైలాస్ వద్దకు చేరుకుని బస్సును స్వాదీనం చేసుకున్నారు. తెల్లవారు జాము 3-30 గంటలకు బస్సు చోరీ కావడం, ఉదయం 6 గంటలకు ఫిర్యాదు చేయడం, మధ్యాహ్నం 3-30 గంటలకు గుర్తించడం మొత్తం 12 గంటల్లోనే పోలీసులు, అధికారులు ఆచూకీని కనిపెట్టారు. మరోవైపు బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడి గురించి దర్యాప్తు జరుపుతున్నారు. చోరీ అయిన బస్సును గుర్తించడంలో సహకరించిన కర్ణాటక పోలీసులతో పాటు తాండూరు పోలీస్టేషన్కు చెందిన పోలీసు సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు