Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కరీంనగర్ కు ఏమైంది ?

0
  • వెంటాడుతున్న రాజకీయ గ్రహణం
  • రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి తొలగింపు
  • పొన్నం ను గుర్తించని అధిష్టానం
  • వివాదాల్లో పాడి కౌశిక్
  • జిల్లా రాజకీయల్లో అస్థిరత
  • నైరాశ్యంలో కార్యకర్తలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండే రాష్ట్ర రాజకీయాలలో కరీంనగర్ కేంద్ర బిందువుగా నిలుస్తుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కరీంనగర్ నాయకులు కీలకంగా వ్యవహరిస్తారు. నాటి పార్లమెంటు సభ్యులు చొక్కా రావు నుండి నేటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వరకు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వారే. తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కేసీఆర్ ఎంపి గా గెలిచి తెలంగాణ ఉద్యమానికి సారధిగా నిలిచారు. నేడు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. అలాంటి స్థితి నుండి నేడు కరీంనగర్ రాజకీయంగా మెల్లిమెల్లిగా మసక బారుతుంది. గత కొన్ని రోజులుగా కరీంనగర్ రాజకీయాలకు గ్రహణం పట్టింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ తమ స్థానాలు సుస్థిరం కావలసింది పోయి రాజకీయ అస్తిత్వంపైనే ప్రభావం పడే స్థితికి చేరుకుంటున్నారు. ఒకరు రాష్ట్ర అధ్యక్ష పదవిని కోల్పోగా, మరొకరు తెలంగాణ ఉద్యమ నాయకునిగా, తెలంగాణ బిల్లు కోసం పార్లమెంటులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని నేడు పార్టీ గుర్తించడం లేదు. మరోవైపు చిన్న వయసులోనే ఉన్నత పదవి అధిష్టించిన యువ నాయకుడు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ కరీంనగర్ జిల్లా ప్రతిష్ట పై ప్రభావం పడేవిధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. ఈ విలక్షణ పరిస్థితుల్లో ప్రధాన పార్టీల్లోని కార్యకర్తలు నైరాశ్యం లోకి జారుకుంటున్నారు.

వెలుగు వెలిగి అధ్యక్ష పదవి కోల్పోయి
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ అనతి కాలంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు. యూత్ లో మాస్ లీడర్ గా, హిందుత్వ ఎజెండా లక్ష్యంగా రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకున్నారు. ఉప ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హిందూ ఫైర్ బ్రాండ్ గా తెలంగాణ సెన్సేషన్ లీడర్ గా ఎదిగారు. ఐదు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా విమర్శిస్తూ బిఆర్ఎస్ కు బిజెపి పార్టీయే ప్రత్యామ్నాయం అన్నస్థితికి తీసుకొచ్చారు. అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే కరీంనగర్ నుండి బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ జోరుగా కొనసాగింది. అయితే గత కొన్ని రోజులుగా బిజెపిలో నెలకొన్న గ్రూపు రాజకీయాలతో పదవిని కోల్పోవల్సి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణులు నైరాశ్యానికి గురయ్యారు. కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్రాన్ని శాసించే పదవి వస్తుందని ఆశించిన జిల్లా బిజెపి శ్రేణులకు నిరాశ ఎదురయింది. దీంతో జిల్లా బిజెపిలో స్తబ్దత నెలకొంది.

ఉద్యమ నాయకుడికి అధిష్టానం స్ట్రోక్
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రాజకీయాలలో ఓ వెలుగు వెలిగారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంటులో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే తో పొన్నం ప్రభాకర్ పై దాడి ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం విధితమే. తెలంగాణ ఆవిర్భావ అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో ఓటమి చూశారు. అయినా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో మారిన రాజకీయ సమీకరణలో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. మొదటినుండి రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. అదే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. 37 మందితో నాలుగు రోజుల క్రితం ఏఐసీసీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ కు చోటు లభించలేదు. రేవంత్ ఆపోజిట్ వర్గమే పొన్నంకు చెక్ పెట్టిందని పొన్నం ప్రభాకర్ వర్గీయులు చెబుతుండగా, రేవంత్ కు పొన్నం ప్రభాకర్ కు మధ్య ఉన్న విభేదాలే ఇందుకు కారణమని మరో చర్చ నడుస్తుంది. ఏది ఏమైనాప్పటికీ దశాబ్దాలుగా కాంగ్రెస్ లో నిబద్ధత కలిగిన నాయకునిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ ను అధిష్టానం పట్టించుకోకపోవడం దురదృష్టకరమే. పొన్నం అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెయ్యి వాహనాలతో హైదరాబాద్ కు వెళ్లి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అనంతరం అసంతృప్తితో ఉన్న పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించినట్లు విశ్వాసనీయ సమాచారం.

యువ నేత వెంటే వివాదాలు
అతి చిన్న వయసులో ఉన్నతమైన ఎమ్మెల్సీ పదవి పాడి కౌశిక్ రెడ్డి ని వరించింది. ఈటల రాజేందర్ కు దీటైన నాయకునిగా కౌశిక్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తున్నారు. కానీ కాకతాళీయమా లేక ఉద్దేశపూర్వకంగానో వివాదాలు అతనిని వెంటాడుతున్నాయి. అతని నోటి వెంట వచ్చిన మాట వివాదాస్పదంగా మారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు కేంద్ర బిందువు నిలుస్తుంది. గవర్నర్ తమిళ్ సై పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. దశాబ్ది ఉత్సవాల్లో రైతు ఉత్సవం రోజు రైతు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసాయి. ముదిరాజ్ లపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలించాయి. దీంతో బిఆర్ఎస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టి వివాదం సద్దుమణిగెలా చేసింది. చిన్న వయసులోనే ఉన్నత అవకాశాలు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి బాధ్యతతో మెలిగి తన రాజకీయ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. జిల్లాలో మూడు ప్రధాన పార్టీలలో నెలకొన్న వివిధ పరిణామాలు రాజకీయంగా అస్థిరత నెలకొనే విధంగా తయారయింది. దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. అసలు కరీంనగర్ జిల్లా రాజకీయాలకు ఏమైందంటూ మదన పడుతున్నారు. తమ నేతల భవిష్యత్ ఎలా ఉండబోతుందంటూ ఆయా పార్టీల కార్యకర్తలు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie