తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అధికార బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం సిఎం, బిఆర్‌ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 115 మందితో ప్రకటించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపాలని కమలం పార్టీ కూడా భావిస్తుంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి అధికార బిఆర్‌ఎస్ పార్టీకి గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో బిజెపి పార్టీ కూడా అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రధానంగా పార్టీలోని బలమైన నేతలంతా ఎన్నికల బరిలో దిగాలని ఆయన కేంద్ర నాయకత్వం ఆదేశించినట్లు తెలుస్తుంది.
తెలంగాణలోని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది. సిఎం కేసీఆర్ వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. గజ్వేల్ నుండి పార్టీ సీనియర్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను, కామారెడ్డి బరిలో బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతిని పోటీ పెట్టాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ నాయకత్వం పార్టీలోని సీనియర్లను, బలమైన నాయకులను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడానికి దృష్టి సారించినట్లు సమాచారం.
సిఎం కేసీఆర్‌ను బలంగా ఢీ క్టొడానికి విజయశాంతి అభ్యర్థి ఉంటే బాగుంటుందని పార్టీలో చర్చ చేసినట్లు తెలుస్తుంది. కేసీఆర్‌పై సమవుజ్జీని పోటీలో పెట్టాలని, మమతపై గత ఎన్నికల సమయంలో బెంగాల్ ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నట్లు పార్టీకి చెందిన నాయకుడొకరు సోమవారం ‘ప్రజాతంత్ర’కు తెలిపారు. ఇందులో భాగంగా తీసుకున్న నిర్ణయంతో విజయశాంతిని కామారెడ్డిలో కేసీఆర్‌పై ఎన్నికల బరిలోకి దించడానికి బిజెపి హైకమాండ్ డిసైడ్ అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ మేరకు విజయశాంతి కూడా •కేసీఆర్‌పై పోటీ చేయడానికి సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం. కామారెడ్డిలో కేసీఆర్‌ని ఎదుర్కునే బలమైన అభ్యర్థి లేకపోవడంతో విజయశాంతిని రంగంలోకి దించాలని భావిస్తున్నారనీ సమాచారం.