బీజేపీకి చేరువ కావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరిపై కమలనాధుల్లో ఇంకా సందేహాలు వీడలేదు. రెండు రాష్ట్రాల్లో టీడీపీతో అనుసరించాల్సిన వైఖరిపై స్పష్టత కొరవడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును అందిపుచ్చుకోవాలనే ఆలోచన బీజేపీలో కూడా ఉండటంతో పొత్తులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బిజేపితో తెలుగుదేశం పార్టీ పొత్తుల వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బీజేపీతో-టీడీపీ పొత్తు అనివార్యమైతే అది ఏపీకి మాత్రమే పరిమితమవుతుందని చెబుతున్నారు.
గడపగడపకు వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్.
తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నా దానిపై బీజేపీ అధినాయకత్వం సానుకూలత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. తెలంగాణలో టిడిపితో బంధం కేవలం “సానుకూల వైఖరి, సందేశాల” వరకే బిజేపి పరిమితం అవుతుందని చెబుతున్నారు.ఏపిలోని జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఇతోదికంగా ఆర్ధిక సహాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం ఆర్దిక సహకారం కొనసాగుతుందని బిజేపి వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీతో తెగదెంపులు చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు.
ఏపీ తెలంగాణలో ఎన్నికల పొత్తులు, రాజకీయ అవగాహనలు పూర్తిగా మోదీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోడి ఎవరితోనూ నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం లేకపోయినా, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఏ నిర్ణయమైన ఉంటుందని చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలనే ప్రతిపాదనలపై బీజేపీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు తమను గతంలో “వెన్నుపోటు” పొడిచారని, మిత్రధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆ వర్గం ఆరోపిస్తోంది.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును అందుకోడానికి బీజేపీని కలుపుకుపోవాలనే చంద్రబాబు వ్యూహాలకు “చెక్” పెట్టేలా నిర్ణయాలు ఉండాలని చెబుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అవగాహన కుదిరినా,గతంలో మాదిరి అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు అన్నిట్లో జోక్యం చేసుకునే విధానాలకు స్వస్తి పలకాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి కేటాయించే స్థానాల్లో టీడీపీ నాయకుల జోక్యం, డమ్మీలను పోటీలో ఉంచడం వంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలనే సూచనలు కూడా ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.ఏపీలో టిడిపిని వ్యూహాత్మకంగా వినియోగించుకోవడం వరకే పరిమితం కావాలని ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది.
“అన్ని జాగ్రత్తలతో” బాబుతో పొత్తులు కుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి తరహాలో బీజేపీలోకి త్వరలో మరికొంత మంది నాయకుల్ని చేర్చుకోవడం ద్వారా బలమైన అభ్యర్థుల్ని పోటీలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ 10 లోకసభ స్థానాలు, 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి బిజేపి సమాయత్తం అవుతోంది. అదే సమయంలో బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నేతలకు చెక్ పెడతారని ప్రత్యర్థులు చెబుతున్నారు.
పైకి బిజేపి నేతలుగా కనిపిస్తూ, టిడిపి క్షేమాన్ని కోరుకునే వారికి ఈసారి ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకూడదని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. బిజేపిలోకి వచ్చిన మాజీ టిడిపి నేతలకు తిరిగి చంద్రబాబే అవకాశం ఇవ్వాలని వైరివర్గం నేతలు చెబుతున్నారు. బిజెపి అభ్యర్దులను కూడా నిర్ణయించే పెత్తనాలను ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితులు లేవంటున్నారు.