వరంగల్, జూలై 21: మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నదా?.. స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నుంచి టికెట్ ఇచ్చి నిలబెట్టాలనుకుంటున్నదా?.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యతో ఉన్న విభేదాలతో కాంగ్రెస్ గూటికి లాగాలని ప్లాన్ చేస్తున్నదా?.. ఆయనను నిలబెడితే గెలుపు నల్లేరుమీద నడకేనని భావిస్తున్నదా?.. వీటన్నింటికి కాంగ్రెస్ వర్గాల నుంచి మాత్రం అవుననే సమాధానమే వస్తున్నది. కడియం శ్రీహరితో కాంగ్రెస్ నేతలు జరిపిన సంప్రదింపుల విషయాన్ని వెల్లడించని ఆ వర్గాలు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చి నిలబెట్టడంపై ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి చాలామంది నేతలను పార్టీలోకి లాగడానికి చేస్తున్న ప్రయత్నాల తరహాలోనే కడియం శ్రీహరి విషయంలోనూ వర్కౌట్ అయ్యే తీరులో కసరత్తు జరుగుతున్నది.ఇప్పటికే స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సింగాపురం ఇందిర పేరును సూత్రప్రాయంగా ఎంపిక చేసి పెట్టుకున్నది.
కానీ, కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకునేలా ప్రయత్నాలు చేసి చివరి నిమిషం వరకూ అభ్యర్థిని ఫైనల్ చేయకుండా పెండింగ్‌లో పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యతో తలెత్తిన విభేదాలను కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి ఎలాగూ 2027 వరకూ ఆ పదవిలోనే కొనసాగుతారు. కానీ, రాజకీయ వారసురాలిగా కుమార్తె డాక్టర్ కావ్యను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా తీసుకురావాలని కోరుకుంటున్నారు. పార్టీ నుంచి అవకాశం లభిస్తుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు.ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వరంగల్ టూర్ సందర్భంగా కడియం శ్రీహరి నివాసానికి వెళ్ళినప్పుడు కావ్య గురించిన ప్రస్తావన వచ్చింది. ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆసక్తిని ప్రస్తావించగా పాజిటివ్‌గా స్పందించినట్లు పలు సందర్భాల్లో కడియం శ్రీహరే స్వయంగా వెల్లడించారు.
సిట్టింగ్‌లందరికీ దాదాపుగా ఈసారి టికెట్‌లు ఇస్తామంటూ కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వెల్లడించడంతో మరోమారు రాజయ్యకే వస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతున్నది. ఇటీవలి వరుస వివాదాలతో ఆయనను ప్రగతి భవన్ పిలిపించుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. టికెట్ విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లు తెలిసింది.ఇప్పటికే 71 సంవత్సరాల వయసుకు చేరుకోవడంతో కుమార్తెను పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని కడియం బలంగా కోరుకుంటున్నారు. ఈసారి టికెట్ రాకపోతే ఆ అసంతృప్తితో పార్టీలోకి తీసుకుని ఆయననే నిలబెట్టాలన్నది కాంగ్రెస్ భావన. ఆయనతో జరిగిన సంప్రదింపుల జరిపారా లేదా అనే విషయాన్ని వెల్లడించని కాంగ్రెస్ వర్గాలు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి మాత్రం ఆయనను నిలబెట్టాలనే పట్టుదలతోనే ఉన్నట్లు తెలిసింది. టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ మారనని, చివరి వరకూ కేసీఆర్‌తోనే ఉంటానని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో వరంగల్ మీడియా ప్రతినిధులతో తన మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించారు. కడియం శ్రీహరి ఆలోచనలు ఎలా ఉన్నా కాంగ్రెస్ నుంచి మాత్రం ఆయనను ఆకర్షించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన అసంతృప్తినే ప్రాతిపదికగా తీసుకుంటున్నది.