దొంగతనం కేసులో ఒకరి అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీసీపీ సీతారాం
జనగామ:నిత్యం కలిసి తిరిగే స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన ఓ ఘనుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీసీపీ ఆఫీస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం ఈ కేసు వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన నల్ల వంశీ, సందెల రాజేశ్ ఇద్దరూ స్నేహితులు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే కొన్ని రోజులుగా చెడు అలవాట్లకు అలావాటు పడిన రాజేశ్ ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో వంశీ తాను అప్పుకట్టేందుకు రూ.10 లక్షలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు.
ఈ విషయం తన స్నేహితుడైన రాజేశ్‌కు కూడా చెప్పాడు. ఈనెల 9న వంశీ దంపతులు ఇంట్లో లేని సమయంలో రాజేశ్ తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసి పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. గురువారం జనగామ బస్టాండ్ సమీపంలో అనుమానంగా ఉన్న రాజేశ్‌ను పట్టుకుని విచారించగా దొంగతనం విషయం బయటపడింది. నిందితుడి నుంచి రూ.10 లక్షలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వివరించారు. కాగా, కేసును చాకచ్యంగా ఛేదించిన ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, నాగబాబు, జనగామ ఎస్సైలు సి.హెచ్ రఘుపతి, యు.సృజన్, క్రైం, ఐటీ కోర్ టీం సిబ్బందిని డీసీపీ అభినందించారు.