Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇవేం లెక్కలు….

0

ఖజనా నింపేందుకు రెట్టింపు ఫీజులు
హైదరాబాద్, ఫిబ్రవరి 20: ‘అంతా ఆన్ లైన్. మేం చేసేదేం లేదు. అంతా కంప్యూటర్ నుంచే. అదే లెక్కిస్తుంది. అదే ఫీజును ఖరారు చేస్తుంది. అక్కడి నుంచే నోటీసు జనరేట్ అవుతుంది. మానవ ప్రమేయమేం లేదు. మమ్మల్నేం చేయమంటారు? మా అవసరమే లేకుండా వచ్చేస్తున్నాయి.’ ఇదీ జీవో 59 దరఖాస్తుదారులకు తహశీల్దార్ల వర్షన్. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పేరిట మళ్లీ కొనుగోలు చేసినంత పని అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఓ వైపు సర్కారీ భూములను మార్కెట్లో పెడుతున్నారు. ప్రతి నెల కొన్ని ల్యాండ్ పార్శిళ్లను అమ్మేస్తూ రూ.వందల కోట్లు మూటగట్టుకుంటున్నారు. అదే క్రమంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్న వారి దగ్గరా పెద్ద మొత్తంలో రాబట్టుకునేందుకు వ్యూహ రచన చేశారు. జీవో-59లో పేర్కొన్న మార్కెట్ విలువ, పెనాల్టీలకు భిన్నంగా వసూలు చేస్తూ అధికారులు నిందలు పడుతున్నారు. క్రమబద్ధీకరణ ఫీజులు పెంచుతున్నామంటూ సవరణ ఉత్తర్వులు జారీ చేస్తే తమకు ఇబ్బంది తగ్గుతుందని అధికారులు అంటున్నారు.

రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.దీంతో జీవో 58, 59 కింద స్వీకరించిన దరఖాస్తులను రెవెన్యూయేతర శాఖల అధికారులు పరిశీలించారు. ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. భూములు/స్థలాల విషయంలో రెవెన్యూయేతర ఉద్యోగులకు అవగాహన తక్కువగా ఉండటంతో తప్పుడు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.ఉత్తర్వుల ప్రకారం 2014 నాటి మార్కెట్ విలువల ఆధారంగా పెనాల్టీలు వేయాలి. ఎలాగూ క్రమబద్ధీకరిస్తున్నామంటూ అందినంత దోచుకుంటూ సర్కారు చుక్కలు చూపిస్తున్నది. ప్రస్తుత మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా పెద్ద మొత్తంలో వసూలు చేసేందుకు ప్లాన్ చేసింది.జీవో 58, 59 లను కొనసాగిస్తూ గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పాత ధరలను పేర్కొన్నారు.

ఇప్పుడేమో ప్రస్తుత ధరల కంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతుండడం విస్మయానికి గురి చేస్తున్నది. కనీసం ఉత్తర్వులను సవరించకుండా ఏ ఆదేశాల ప్రకారం పెద్ద మొత్తంలో పెనాల్టీలు వేస్తున్నారన్న ప్రశ్నలకు రెవెన్యూ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. తమకేం తెలియదని, అంతా కంప్యూటర్ నుంచే జనరేట్ అవుతోందంటూ తప్పించుకుంటున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను వచ్చే నెల 31వ తేదీలోపు 100% ముగించాలని ప్రభుత్వం కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేయాలని తహశీల్దార్లకు కలెక్టర్లు ఆదేశించినట్లు తెలిసింది. ఒక స్థలం 100 గజాలు ఉంటే.. 80 గజాల్లోనే ఇంటి నిర్మాణం ఉంటుంది. కానీ.. ఖాళీగా ఉన్న 20 గజాలకు కూడా పెనాల్టీ వేసినట్లు రెవెన్యూ అధికారులే ఒప్పుకుంటున్నారు. మార్కెట్ విలువపైనా స్పష్టత లేకపోవడంతో నోటీసుల్లో పెనాల్టీ పెద్ద మొత్తంలో వేస్తున్నట్లు చెబుతున్నారు.

జీవో 58, 59 కింద గతేడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 30 నాటికి జీవో 58 కింద 87,520, జీవో 59 కింద 59,748.. మొత్తంగా 1,47,268 దరఖాస్తులు అందాయి. మిగిలిన ఒక్క రోజులో ఎన్ని వేల దరఖాస్తులు అందాయో ఎవరికీ తెలియదు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆఖరి చాన్స్ అంటూ ప్రభుత్వం మాత్రం ఖజానాను నింపుకునే ప్లాన్ చేసింది.మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని న్యూ రెసిడెన్షియల్ లొకాలిటీస్ లో ఇల్లు నిర్మించిన 250 గజాల స్థలానికి రూ.46,39,750 వేశారు. రూ.16,23,913, రూ.16,23,913, రూ.13,91,925 వంతున మూడు విడతలుగా చెల్లించాలన్నారు. అంటే.. ప్రభుత్వం గజానికి రూ.18,559 గా లెక్కించింది. ఇక్కడ ప్రస్తుత రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ గజానికి రూ.14,700కు మించి లేదు. మరి ఈ లెక్కలేమిటో అర్ధం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాప్రాలో 100 గజాల ఇంటికి రూ.1.20 కోట్లకు నోటీసు పంపారు. అదే ఏరియాలో అంతే విస్తీర్ణానికి రూ.1 కోటి వరకు వచ్చింది. కొత్త ఇల్లు కొనుగోలు చేసినా అంత కాదు. అలాంటప్పుడు ఇంతేసి సొమ్ము ప్రభుత్వానికి ఎందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నారు.హైదరాబాద్మలక్ పేటలో 85 గజాల ఇంటికి ఏకంగా రూ.15,66,875 కట్టాలని నోటీసులు జారీ చేశారు. ఈ బిల్లు చూసి దరఖాస్తుదారులు అవాక్కయ్యారు. మొదటి విడత జనవరి 3న, రెండో విడత ఫిబ్రవరి 3న, మూడో విడత మార్చి 3వ తేదీ వరకు గడువు అంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి మార్కెట్ విలువ ఆధారంగా లెక్కించినా రూ.6 లక్షలు మించదు. అక్కడ ప్రస్తుతం గజం రూ.29,100 వరకు ఉందిజీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారికి 2014లో ఉన్న మార్కెట్ విలువలు, స్లాబ్స్ ప్రకారం డబ్బులు కట్టాలని నోటీసులివ్వాలి. కానీ ప్రస్తుత మార్కెట్ విలువ కంటే ఎక్కువ కట్టాలని నోటీసులు జారీ చేస్తున్నారు. 250 గజాల స్థలానికి రూ.8 లక్షలు కట్టాలి. కానీ రూ.46 లక్షలకు పైగా వేశారు. రెవెన్యూ అధికారులకు లెక్కలు రావా? నోటీసులు ఆలస్యంగా ఇచ్చి.. ముందుగా ఎంతో కొంత కట్టాలని అధికారులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie