అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడికి ప్రయత్నించిన భారతీయ సంతతి యువకుడు సాయి వర్షిత్ కందులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో తెలుగు యువకుడు సంచలన విషయాలు వెల్లడించాడు. వైట్‌హౌస్‌ను నియంత్రణలోకి తీసుకొని అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే.. తాను దాడికి పాల్పడ్డానని తెలిపాడు. ఈ క్రమంలో అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్.. అడ్డం వచ్చే ఎవరినైనా చంపేందుకు వెనుకాడకూడదని నిశ్చయించుకున్నట్టు పేర్కొన్నారు.
మిసోరిలోని ఛెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్.. సెయింట్ లూయిస్‌లో విమానం ఎక్కి వాషింగ్టన్ డీసీలోని డలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. అక్కడే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్ ఉత్తరభాగంలోని లాఫియెట్ పార్క్‌కు చేరుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.35 గంటలకు పార్క్ సమీపంలోని బారికేడ్లను తొలుత ఢీకొట్టాడు. ట్రక్కును వెనక్కి మళ్లించి రెండోసారి ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో వర్షిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రమాదకరమైన ఆయుధంతో దాడి, మోటారు వాహనం నడపడంలో నిర్లక్ష్యం, అధ్యక్షుడిని, ఉపాధ్యక్షురాలిని, వారి కుటుంబ సభ్యులను చంపుతానని, కిడ్నాప్ చేస్తానని, గాయపరుస్తానని బెదిరించడం.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం తదితర అభియోగాలను నమోదు చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన సాయివర్షిత్.. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజీలపై అవగాహన ఉన్న సాయి.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా తెలిసింది.అయితే, అతడిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదని పోలీసులు తెలిపారు. అటు, సాయివర్షిత్ స్నేహితులు ఈ సంఘటనపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.చాలా మంచి వ్యక్తి అని.. సరదాగా ఉంటాడని వర్షిత్‌తో కలిసి చదువుకున్న ఈరియన్ బార్‌ఫీల్డ్ అనే యువకుడు తెలిపారు.
తను మానసికంగా సంఘర్షణకు గురైనట్లు ఉన్నాడని, లేకపోతే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని మరో స్నేహితుడు పేర్కొన్నాడు. వైట్ హౌస్’విషయంలో తన లక్ష్యం నెరవేరిందని, ఎందుకంటే సీక్రెట్ సర్వీస్ వంటి దర్యాప్తు సంస్థలకు మెసేజ్ పంపడమే తన ఉద్దేశమని సాయి వెల్లడించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడికి ఆరు నెలల నుంచి ప్రణాళిక రచిస్తున్నట్టు బయటపెట్టాడు. ‘వైట్‌హౌస్‌లోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే నా లక్ష్యం’ అని చెప్పాడు.ఈ సమయంలో అధికారాన్ని ఎలా చేజిక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ప్రశ్నించడంతో.. ‘‘అవసరమైతే బైడెన్‌ను చంపేయాలనుకున్నా.
ఉగ్రవాదం వీడితేనే పాక్‌తో మైత్రి : మోదీ కీలక వ్యాఖ్యలు
లేదా అక్కడున్న వారిలో ఎవరినైనా గాయపర్చడమో, చంపడమో చేయాలనుకున్నా’’ అని వర్షిత్ బదులిచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద నాజీ జెండాను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.‘జర్మనీ నియంత హిట్లరంటే తనకు ఇష్టమని.. ఆయన బలమైన నేత. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది’ అని నిందితుడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. తనను అరెస్ట్ చేస్తారని, అయితే తన ‘పుస్తకం’ చూడాల్సిన వారికి అందుతుందని కందుల పోలీసులకు చెప్పారు. వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడం, అధ్యక్షుడిగా ఉంటే ఏం సాధించాలని అనేవి‘గ్రీన్ బుక్’ రూపంలో తన ఆలోచనలను గత ఆరు నెలలుగా రాయడం ప్రారంభించినట్టు విచారణలో వెల్లడించాడు. దీంతో సాయి వర్షిత్ మానసిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకోసం అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.