విజయవాడ, ఫిబ్రవరి 7, (న్యూస్ పల్స్): ఇదీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేటెస్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు జనసేనతోనే ఉన్నాం… జనసేనతోనే ఉంటాం.. జనసేనా కూడా మాతోనే ఉంటుందన్న సోము మాట మారిపోతోంది. ఒక రోజు కాదు… ఒకసారి కాదు… రోజూ అదే మాట.. అదే తీరు. జనసేనాని ఏమన్నా…. ఏం చెప్పినా…. చివరికి మాతోనే ఉంటారనే ధీమాతో ఉండేది ఏపీ బీజేపీ. అంతేకాదు నేతల మాటల్లో కూడా అది స్పష్టంగా కనిపించేది. కానీ ఓటు చీలనివ్వనని కంకణం కట్టుకున్న పవన్ తీరు చూస్తున్న బీజేపీకి వాస్తవం బోధపడుతున్నట్టుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు… శాశ్వత మిత్రులు ఉండరని బీజేపీ ఆలస్యంగా గుర్తించినట్టుంది.
పవన్ ప్రయాణం టీడీపీ వైపు వెళ్తున్నట్టు గ్రహించింది. ఏం చెప్పినా… ఏం చేసినా… పవన్ ఆగేలా లేరని గ్రహించినట్టుంది. అందుకే బాణీ మార్చింది. మా పోత్తు జనంతో…. కుదిరితే జనసేనతో అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. అంతేనా… కుదిరితే జనసేనతో అంటున్న తమ మాటల వెనుక చాలా పెద్ద అర్ధం ఉందంటూ తమ మనసులోని భావాన్ని అర్ధం చేసుకోడంటూ క్లూ కూడా ఇచ్చారు సోము వీర్రాజు.భీమవరంలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనే ఒంటరిపోరుపై బీజేపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. పవన్ మీద నమ్మకం పెట్టుకుని కూర్చోకుండా సొంతంగా నెగ్గడం ఎలాగో చూసుకోండి అంటూ తేల్చి చెప్పింది. అయినా సరే ఇంకా పార్టీలో జనసేనతో పొత్తు ఉంటుందనే నమ్మకం పోలేదు. చివరికి కలిసే పోటీ చేస్తాం అని అనుకునే వాళ్లు కమలం పార్టీ నిండా చాలా మందే ఉన్నారట. ఇది అసలుకే ఎసరు తెచ్చేలా ఉందని ఆందోళనలో పడ్డారట అధ్యక్షుడు. అందుకే క్రమక్రమంగా అసలు విషయం అర్ధమయ్యేలా కేడర్ కు చెప్తున్నారట.
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సోము వీర్రాజు అడిగిన వాళ్లకు.. అడగని వాళ్లకు ఇదే విషయం చెప్పేస్తున్నారట. పవన్ ను… ఆయన పార్టీతో పొత్తును నమ్ముకుంటే నిండా మునిగిపోతామనే భయంతో బీజేపీ వ్యూహం ఛేంజ్ చేస్తోందట. చివరి వరకు జనసేనను పట్టుకుని వేలాడి… చివరకు ఆ పార్టీ తమను వదిలేస్తే పరువు పోతుందని అనుకుంటోందట. అందుకే ఇప్పటి నుంచే స్లో పాయిజన్ లాగా కుదిరితేనే అంటూ షరతు పెడుతోందట. పొత్తు కుదిరితే ఓకే… కుదరకుంటే… మేం అప్పుడే చెప్పాం కదా? అని తప్పించుకోడానికి వీలుగానే ఈ డైలాగ్ ను సోము వీర్రాజు వాడేస్తున్నారట.