భారత దేశం, అమెరికా బహుళ రంగాల్లో సత్సంబంధాలను విస్తరించుకుంటున్నాయి. ఎగుమతుల నియంత్రణలను గాడిలో పెట్టడం, హై-టెక్ కామర్స్‌ను మరింత విస్తరించడం, ఇరు దేశాలు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు మార్గం సుగమం చేయడం వంటివాటిపై దృష్టి పెడుతున్నాయి. వీటన్నిటి కోసం ఇనీషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫలితాలను అమలు చేయడంలో భాగంగా మొదటి వ్యూహాత్మక వాణిజ్య చర్చలు జూన్ 4, 5 తేదీల్లో జరగబోతున్నాయి.ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య ఐసెట్ మొదటి సమావేశం జనవరి 31న జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను పునఃప్రారంభించేందుకు అమెరికన్ కామర్స్ సెక్రటరీ గినా రైమండో మార్చి 10న భారత దేశంలో పర్యటించారు.
ఈ సందర్భంగా వ్యూహాత్మక వాణిజ్య చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా వచ్చే నెల ప్రారంభంలో అమెరికా వెళ్తారు. అమెరికన్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ అండర్ సెక్రటరీ (కామర్స్) అలన్ ఎస్టేవెజ్‌తో సమావేశమవుతారు. వ్యూహాత్మక వాణిజ్య చర్చలు జరపడంతోపాటు, జూన్ 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైట్ హౌస్‌కు వెళ్తుండటంతో, తుది సన్నాహాలు చేస్తారు. భారత దేశంలో సాయుధ డ్రోన్ల తయారీ, మ్యునిషన్ టెక్నాలజీస్, విమానాల ఇంజిన్లు వంటి హైటెక్ సిస్టమ్స్ ఉత్పత్తి కోసం అమెరికా కంపెనీలకు అత్యంత ముఖ్యమైన నిబంధనలను సరళతరం చేసే విధంగా వినయ్ కృషి చేస్తారు.
ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్స్, ఎక్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ కారణంగా అమెరికన్ కంపెనీలు, భారత దేశ కంపెనీలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించి, ఇరు దేశాల కంపెనీలు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జూన్ 22న సమావేశమవుతారు.ఈ నెల 19 నుంచి 21 వరకు జపాన్‌లో జరిగే జీ-7 సదస్సు నేపథ్యంలో మోదీ, బైడెన్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ నెల 24న జరిగే క్వాడ్ సదస్సు సందర్భంగా కూడా వీరిరువురూ కలిసే అవకాశం ఉంది
. ఫార్ పసిఫిక్ నేషన్స్ క్రిటికల్ ఎంగేజ్‌మెంట్‌లో భాగంగా మే 22న పపువా న్యూగినియాలోని పోర్ట్ మోర్స్‌బైలో కూడా వీరిరువురూ కలవవచ్చు.సోలోమన్ దీవుల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఫార్ పసిఫిక్‌తో భారత దేశం విస్తృత స్థాయి సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ దీవికి 100 మిలియన్ డాలర్ల రుణాన్ని మోదీ ప్రకటించబోతున్నారు.ఇరు దేశాల దౌత్యవేత్తలు తెలిపిన సమాచారం ప్రకారం, తేజస్ మార్క్-2 కోసం భారత దేశంలో ఎఫ్-414 జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేయడం కోసం అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ చేసిన దరఖాస్తుకు అమెరికా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
అతి తీవ్ర తుఫాన్‌గా మారిన మోచ తుఫాన్.
ఈ ఆమోదం మోదీ అమెరికా పర్యటనకు ముందే లభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి యూరోపియన్ యూనియన్‌లో ఉన్న అనుబంధ కంపెనీలు కూడా భారత దేశానికి వచ్చే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీలు ఎఫ్-414 ఇంజిన్లను భారత దేశంలోనే తయారు చేస్తాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా డ్రోన్లు సృష్టిస్తున్న ఇబ్బందులను తిప్పి కొట్టడానికి ఉపయోగపడే సాయుధ డ్రోన్లను భారత దేశానికి సరఫరా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది.