న్యూ దిల్లీ, జులై 25 : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్టాన్రికి అక్రమంగా తరలివస్తున్నవారు అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది. వారిని వెంటనే దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషీ సోమవారం రాత్రి అస్సాం రైఫిల్స్‌కు రాసిన లేఖలో, జూలై 22, 23 తేదీల్లో మయన్మార్ నుంచి అక్రమంగా 718 మంది భారత దేశంలో చొరబడ్డారని తెలిపారు.
ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినపుడు సరిహద్దు భద్రతా దళమైన అస్సాం రైఫిల్స్‌కు ఓ లేఖను రాష్ట్ర ప్రభుత్వం రాసిందని, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారు చెల్లుబాటయ్యే వీసా/ట్రావెల్ డాక్యుమెంట్స్ చూపించకపోతే, దేశంలోకి ప్రవేశించనివ్వవద్దని చెప్పిందని గుర్తు చేశారు. ఇటువంటివారిని ఏ కారణంతోనూ రాష్ట్రంలో ప్రవేశించనివ్వొద్దని చెప్పినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ లేఖను రాసినట్లు తెలిపారు.
ఈ మయన్మార్ జాతీయులను భారత దేశంలోకి ఎందుకు ప్రవేశించనిచ్చారో వివరణ ఇవ్వాలని అస్సాం రైఫిల్స్ అథారిటీని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. వీరిని తక్షణమే భారత దేశం నుంచి పంపించేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చండేల్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు అస్సాం రైఫిల్స్ రాసిన లేఖలో ఇండో-మయన్మార్ సరిహద్దుల్లోని చండేల్‌లోనికి జూలై 23న 718 మంది ప్రవేశించినట్లు తెలిపింది. ఖంపట్‌లో ఘర్షణల వల్ల వీరు రాష్ట్రంలోకి ప్రవేశించారని తెలిపింది. వీరి బయోమెట్రిక్స్, ఫొటోలు తీసుకుని వెంటనే దేశం నుంచి పంపించేయడానికి చేపడుతున్న చర్యలను చండేల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.