- అసైన్డ్ భూములలో అడ్డగోలుగా భవన నిర్మాణాలు
- కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ చోద్యం చూస్తున్న టాస్క్ ఫోర్స్ అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో అక్రమ భవన నిర్మాణాలు అడ్డగోలుగా చేపడుతున్నారు.యదేచ్చగా అక్రమ భవననిర్మానాలు జరుగుతున్నా..అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులు నిల్.. అక్రమ భవననిర్మానాలు ఫుల్ అనే చందంగా కొనసాగుతోంది. మండలంలోని రేగుల గూడెం, గంగారం ఎక్స్ రోడ్176,181,184 సర్వే నెంబర్లతో పాటు రుద్రారం క్రాస్ రోడ్డు,మేడిపల్లి గ్రామాల పరిధిలోని అసైన్డు భూములలో విచ్చలవిడిగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి.ప్రభుత్వం గతంలో పేదలకు వ్యవసాయం చేసుకొని జీవించడానికి ఈ భూములను అందించారు.నిభందనల ప్రకారం ప్రభుత్వం అసైన్డ్ చేసిన ఈ భూములలో వ్యవసాయం మాత్రమే చేసుకొని జీవించాలి. ఎలాంటి కమర్షియల్ నిర్మాణాలు, క్రయవిక్రయాలు,కొనుగోల్లు కానీ చేపట్టరాదు.
ఉచితంగా ప్రభుత్వం అందించిన ఈ భూములు కాటారం-మంథని, కాటారం-భూపాలపల్లి ప్రధాన రహదారులకు ఆనుకుని ఉండడంవల్ల మంచి డిమాండ్ ఏర్పడింది.దీంతో ఈ భూములలో కొందరు వ్యక్తులు రంగ ప్రవేశం చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి స్థలాలుగా మార్చి విక్రయాలు జరిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఔట్లు,డీటిసిపి అప్రూవల్, గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా పెద్ద పెద్ద భవనాలను నిర్మాణాలు చేపడుతున్నారు.దీంతో పలువురు వ్యక్తులు జిల్లా కలెక్టర్కు అక్రమ భవన నిర్మాణాలపై గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రెవెన్యూ,పోలీస్,మండల పరిషత్ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.ప్రభుత్వ అసైన్డ్ భూములలో ఎలాంటి అక్రమ భవన నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.అయితే కలెక్టర్ ఆదేశాలను ఇక్కడి అధికారులు,భవన నిర్మాణదారులు బేఖాతర్ చేస్తున్నారు.యదేచ్చగా భవన నిర్మాణాలు చేపడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.దాంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.రోజురోజుకు అక్రమ భవన నిర్మాణాలు పెరుగుతున్నా..టాస్క్ ఫోర్స్ అధికారులు కళ్ళుండి చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమ్యామ్యాల కోసమే
ప్రభుత్వ అసైన్డ్ భూములలో అక్రమంగా పెద్ద ఎత్తున భావన నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. అధికారులకు అమ్యామ్యాలు అందడంతోనే ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా గ్రామపంచాయతీ అధికారులు, కార్యదర్శులు నిర్మాణాలను రోజూ చూస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ నీరు భవన నిర్మాణాలను నిరోధించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.