- వరద బాధితుల వద్దకు పరుగులు..
- ఎమ్మెల్యే సీతక్క ఔదార్యం..
- వరద బాధిత కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు..
భారీ వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితులలో వరద బాధితులను ఓదార్చేందుకు బురదను సైతం లెక్కచేయకుండా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివారం బురదలో నడిచారు. చెప్పులు చేత పట్టుకొని, సామాన్య వ్యక్తిలా బురదలో నడుస్తూ వరద బాధితుల వద్దకు చేరుకుని పరామర్శిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్(రా) మండలంలోని భూర్గుపేట గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం, 50కేజీ ల బియ్యం అందించారు. ముందుగా కోతకు గురై తెగిన మారేడు గుండ చెరువును పరిశీలించి, భూర్గుపేట గ్రామానికి చెందిన బండసారయ్య, సారమ్మ, రాజమ్మ లు వాగులో కొట్టుకు పోయి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి, 10 వేల ఆర్థిక సాయం 50 కేజీల బియ్యం అందించి, ముంపుకు గురైన 32 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించారు.
మారేడు గుండ చెరువు తెగి మరణించిన కుటుంబాలకు రాష్ట్రం ప్రభుత్వం రూ.25 లక్షల నష్ట పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మారేడు గుండ తెగిపోవడం తో రైతులకు తీవ్రనష్టం జరిగిందని, అధికారులు వెంటనే చెరువు మరమ్మతు పనులు, రాక పోకలకు అంతరాయం కలగకుండా రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని, ముంపుకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.