- కోర్టు తీర్పులతో మినిస్టర్లు శ్రీనివాస్ గౌడ్, గంగులకు ముచ్చెమటలు
- శ్రీనివాస్ గౌడ్ పై ట్యాంపరింగ్ కేసుకు నాంపల్లి కోర్టు ఆదేశం
- స్టేట్, సెంట్రల్ రిట్నరింగ్ ఆఫీసర్లు, ఐఏఎస్ లపై కూడా..
- గంగులపై బండి వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
- రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు
- ఆగస్టు 12 నుంచి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్
- తదుపరి విచారణ 21కి వాయిదా
తెలంగాణ మంత్రులకు ఉచ్చు బిగుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు చేసిన తప్పిదాలు ప్రస్తుతం వారి మెడకు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల్లో వారు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు రుజువైతే మంత్రులకు పదవీ గండం తప్పేట్టు కనిపించడం లేదు. పైగా ఎన్నికల నిబంధనల మేరకు వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఏకంగా ట్యాంపరింగ్ కేసు పెట్టాలని సోమవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఒక మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కానుండటం విశేషం. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పంచుకోవద్దని మంత్రికి కోర్టు సూచించింది.
తెలంగాణలో రెండోసారి (2018) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వి. శ్రీనివాస్ గౌడ్ తన Tampering with affidavit అఫిడవిట్ ను ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. అఫిడవిట్ ట్యాంపరింగ్ కు పాల్పడిన మంత్రి మంత్రితోపాటు నలుగురు ఐఏఎస్ అధికారులపైనా కేసులు నమోదు చేయాలని తెలిపింది. ఎన్నికల కమిషన్ కు సంబంధించి స్టేట్, సెంట్రల్ ఆఫీసర్లపైనా, రిటర్నింగ్ అధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. కాగారాఘవేందర్ రాజు వేసిన పిటిషన్ కొట్టేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కేసు పూర్వాపరాలు తెలియకుండా, పిటిషన్ ను పరిశీలించకుండా తాము ఏ నిర్ణయమూ తీసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..
మినిస్టర్శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్ గౌడ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు తేలింది. ప్రధానంగా లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించారని తేలింది. మళ్లీ సవరించిన అఫిడవిట్‌ను నెలన్నర తర్వాత అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణ వచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎలక్షన్ కమిషన్ నివేదిక తెప్పించుకుంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్ గోయల్ బదిలీపై వెళ్లారు. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది.
గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ట్యాంపరింగ్‌ను టెక్నికల్ బృందం ధృవీకరిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. అదే జరిగితే శ్రీనివాస్ గౌడ్ మంత్రి, ఎమ్మెల్యే పదవి కోల్పోవడమేకాదు శిక్షకు కూడా అర్హులయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసుపై గతవారమే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి వేసిన పిటిషన్‌ను జూలై 25వ తేదీన హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.
కేసు నమోదైతే..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. పిటిషనర్ తోపాటు మంత్రి స్టేట్ మెంట్‌ను రికార్డు చేస్తారు. ఈ సందర్భంగా పిటిషనర్ దగ్గర ఉన్న ఆధారాలను సమగ్రంగా సేకరిస్తారు. ట్యాంపరింగ్ ఎలా జరిగింది..? దీనికి ఎవరెవరు సహకరించారు..? ఎవరి పాత్ర ఎంత…? ఏయే అంశాలను మార్చారు..? ఈ మార్పునకు సహకరించిన అధికారులు ఎవరు.? దీని వెనుక ఎవరి హస్తం ఉంది. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ఎలా సాగింది…? అధికారులు వాటిని గమనించలేదా.? అన్న అంశాలపై ఆరా తీస్తారు. అలాగే స్క్రూటినీ తర్వాతే శ్రీనివాస్ గౌడ్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డారా? అనే అంశాలపై పోలీసులు లోతైన విచారణ జరిపి ప్రజాప్రతినిధులు కోర్టుకు సమర్పించా ఉంటుంది. తదుపరి ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకొని తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది.
మంత్రి గంగులకు కూడా తిప్పలే..
State BC Social Welfare Minister Gangula Kamalakar రాష్ట్ర బీసీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇబ్బందులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి ఎన్నిక చెల్లదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసులో పుర్వాపరాలను సమగ్రంగా తెలుసుకునేందుకు రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12 నుంచి 17 వరకు మంత్రిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21కు వాయిదా వేసింది.