మాస్కో, ఫిబ్రవరి 13,
రష్యాకు చెందిన గర్భిణీ స్త్రీలు దేశం విడిచి.. అర్జెంటీనాకు వలస వెళ్తున్నారు. గతకొన్ని నెలల నుంచి మొదలైన ఈ వలసల్లో భాగంగా ఇప్పటివరకూ 5 వేల మంది గర్భిణీ మహిళలు అర్జెంటీనా పౌరసత్వం పొందారు. వీళ్లందరూ ఇలా రష్యా విడిచి అర్జెంటీనాకు వెళ్లడానికి కారణం.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధమే! ఈ యుద్ధం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయంతో.. అర్జెంటీనాకు తరలి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో అర్జెంటీనకు వెళ్తున్న రష్యా మహిళల సంఖ్య మరింత పెరిగిందని.. ఒక్క రోజే 33 మంది మహిళలు వెళ్లారని తేలింది. తొలుత పర్యాటకులుగా అక్కడ పాదం మోపి.. ఆ తర్వాత అర్జెంటీనా పౌరసత్వం పొందుతున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో..
రష్యాలో కంటే అర్జెంటీనాలోనే ఎక్కువ స్వేచ్ఛ ఉండటంతో, తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలని రష్యా గర్భిణీలు కోరుకుంటున్నారు. అర్జెంటీనా వీసాతో కలిగే ఓ గొప్ప ప్రయోజనం ఏమిటంటే.. అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. కానీ.. రష్యా వీసా కలిగిన వాళ్లు 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతి ఉంది. మరోవైపు.. రష్యా నుంచి గర్భిణీలు ఇలా తరలివెళ్తున్న తరుణంలో, ఓ రష్యన్ వెబ్‌సైట్ అర్జెంటీనాపై అక్కసు వెళ్లగక్కింది.
అర్జెంటీనాలో ప్రసవించే గర్భిణీలకు అక్కడి ప్రభుత్వం వివిధ ప్యాకేజీలు అందిస్తోందని, ఇదొక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని పేర్కొంది. అంతేకాదు.. రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలోనే స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేస్తోందని రాసుకొచ్చింది. ఇది పచ్చి అబద్ధమని అర్జెంటీనా అధికారులు స్పష్టం చేశారు.ఇదిలావుండగా.. అర్జెంటీనాకు తరలివెళ్లిన 33 మంది మహిళల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్లే అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఆ ముగ్గురి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తప్పుడు పర్యాటకులన్న అనుమానంతో వారిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.