గతంలో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్లు, పార్టీ అధ్యక్షులుగా కలిసి పని చేశాం
అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, ఫిబ్రవరి 10: స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి గొప్పగా పనిచేసేవారని, వారిని చూసి నేర్చుకోవాలని గతంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాకు చెప్పేవారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
పోచారం శ్రీనివాసరెడ్డి, తాను గతంలో డీసిసిబి చైర్మన్లుగా, పార్టీ అధ్యక్షులుగా పనిచేశామని చెప్పారు. పార్టీ అధ్యక్షులుగా పనిచేసేటప్పుడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ సభ్యత్వం బాగా చేస్తున్నారని, ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పేవారన్నారు. అనంతరం ఆసర పెన్షన్లపై సభ్యులు గువ్వల బాలరాజు, పద్మాదేవేందర్ రెడ్డి, జాజుల సురేందర్, జాఫర్ హుస్సేన్, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకు సామాజిక భద్రతలో భాగంగా 2014 నుంచి సిఎం కేసిఆర్ నాయకత్వంలో ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి వ్యాధి గ్రస్తులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు మన ప్రభుత్వంలోనే పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా డయాలసిస్ 4వేల మందికి 944 పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 29 లక్షలు మందికి పెన్షన్లు ఇవ్వగా ఇప్పుడు 44 లక్షల 12 వేల 882 మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అప్పుడు పెన్షన్ 200 రూపాయలిస్తే ఇప్పుడు 2000 రూపాయలిస్తున్నామన్నారు. అప్పట్లో ఏటా పెన్షన్ల కోసం 861 కోట్లు ఇవ్వగా…ఇప్పుడు 12వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించామన్నారు.