ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయాలు, వినియోగంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధులు గంజాయి వినియోగానికి అలవాటు పడటం కలకలం రేపుతోంది.ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వ్యసనాలకు బానిసలైన ఏడుగురు గంజాయి, మద్యం తాగి గొడవలు చేస్తున్నారంటూ సహ విద్యార్ధులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఉన్నత భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్ధులు ఇలా కట్టు తప్పి మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్ధులపై సహ విద్యార్ధులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.
మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఏడుగురు వ్యసనాలకు బానిసై అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మిగిలిన విద్యార్థులు ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్‌బాబుకు సోమవారం ఫిర్యాదు చేశారుప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థుల తీరుపై గతేడాది కాలంగా కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. విద్యార్థులు హాస్టల్‌లో గంజాయి తాగుతున్నారని, మద్యం తాగి అర్ధరాత్రి గొడవ చేస్తున్నారని, అడ్డు చెప్పిన వారిపై దుర్భాషలాడుతూ చేయి చేసుకుంటున్నారని గతంలో పలువురు ఫిర్యాదు చేశారు.దీనిపై కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అప్పట్లో విచారణ చేపట్టారు.విద్యార్ధుల ఫిర్యాదుపై అప్పటి ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ ఏడుగురు విద్యార్ధులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు.ఆ తర్వాత మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ బదిలీ అయ్యారు.
రెగ్యులర్ ప్రిన్సిపల్ రావడానికి కొంత సమయం పట్టింది. ఈ క్రమంలో ఈ ఏడుగురూ విద్యార్ధులు మళ్లీ హాస్టల్‌లోకి ప్రవేశించారు.హాస్టల్‌కు వచ్చినప్పటి నుంచి మళ్లీ గొడవ చేయడం మొదలు పెట్టారు. గతంలో తమపై ఫిర్యాదు చేసిన వారిని గుర్తించి దుర్భాషలాడడం, మద్యం తాగి గొడవ చేస్తుండడంతో ఇటీవల విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగింది. హాస్టల్లో తమను ఇబ్బంది పెడుతున్న వారిపై విద్యార్ధులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మిగిలిన వారిని ఇబ్బంది పెడుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులతో చర్చిస్తామని, పరిస్థితిలో మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు.