మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇష్యూ అధికార వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటంపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాది క్రితం జరిగిన క్యాబినెట్ విస్తరణలో మళ్లీ తనకు చోటు దక్కలేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు బాలినేని. ఆయన అనుచరులు హంగామా చేయటం, సజ్జల లాంటి వ్యక్తి బాలినేని ఇంటికి రెండు మూడు దఫాలు తిరిగి బుజ్జగించటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత సీఎం జగన్ సైతం క్యాంపు ఆఫీసుకు బాలినేనిని పిలిపించుకొని స్వయంగా మాట్లాడారు.
దీంతో అప్పట్లో బాలినేని అలకపాన్పు దిగారు. తాజాగా సీఎం జగన్ సభలో ప్రొటోకాల్ అంశం బాలినేనిలో అసంతృప్తికి కారణం అయ్యిందనే చర్చ జరుగుతోందట.ఐతే ఈ ఎపిసోడ్ బాలినేనికి మాత్రమే పరిమితం కాదన్నది వైసీపీ సీనియర్ నేతల టాక్. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు, రీజనల్ కో ఆర్డినేటర్‌గా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడం అంత తేలిక కాదంటున్నారు. ఎన్నికల ఏడాది నియోజవకవర్గాన్ని చూసుకోకపోతే గ్రౌండ్‌లో నష్టపోతామన్నది పార్టీ నేతల వాదనగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 12 మంది రీజనల్ కో ఆర్డినేటర్లలో ఇద్దరు మంత్రులు ఉంటే మిగిలిన వారు ఎంపీ, ఎమ్మెల్యే లాంటి ఇతర బాధ్యతలు ఉన్న వారే.
దీంతో చాలామంది రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతకు న్యాయం చేయటం లేదన్న విమర్శా..ఉంది. రీజనల్ కోఆర్డినేటర్లు గానూ, జిల్లా అధ్యక్షులుగాను పని తీరు సరిగా లేకపోవటంతోనే గతంలో అధినేత జగన్….కొడాలి నాని, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారిని పక్కకు తప్పించారు. పని చేసే వారికే పోస్టులు అనే మెసేజ్‌ను జగన్ చాలా స్పష్టంగా పార్టీ నాయకుల్లోకి పంపించారు.ఇక…ఆ తర్వాత కూడా నేతల్లో పెద్దగా మార్పు రాలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి వంటి వారు మాత్రం కాస్త రెగ్యులర్‌గా తమ పరిధిలోని జిల్లాల నేతలతో సమావేశాలు పెట్టుకోవటం, గ్రూపు తగాదాలు ఉంటే సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆళ్ళ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాశ్ చంద్రబోస్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వంటి కొంత మంది నేతలు సమీక్షల జోలికే వెళ్లటం లేదన్న విమర్శ ఉంది. బాలినేని కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరించే నాయకుల జాబితాలోని వారే. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది. నాయకుల మధ్య సమన్వయం వచ్చేటట్లు చూడాలి. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకుని వెళ్లాలి. ఈ పనులన్నీ చూడటం కొంతమంది నేతలకు తలకు మించిన భారంగా మారుతోందట.
మాకొద్దు బాబోయ్ ఈ బరువు అంటున్నారని టాక్. కొన్ని చోట్ల వీళ్ల మాటను ఖాతరు చేయని పరిస్థితులు ఉన్నాయని సమాచారం. మరోవైపు…తాను గెలిచి ఎంపీనో, ఎమ్మెల్యేనో అయితే చాలు పార్టీ ఎలా పోతే తనకేంటి అనే నేతల వైఖరిపై పార్టీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటామన్న ఆలోచన లేకుండా…బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి సీనియర్ నేతలు సైతం సాకులు వెతుక్కోవటాన్ని పార్టీ శ్రేణులు తప్పుబడుతున్నాయట. బాలినేని బాటలో ఇంకా ఎవరైన ఉన్నారా?నేతల సాకులకు అధినేత ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారన్న చర్చ జరుగుతోంది.