- 4 తులాల బంగారం, 71 తులాల వెండి, ఒక ట్రాలీ ఆటో, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం
- వివరాలు వెల్లడించిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం
జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ మండలాల పరిధిలో అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం లో దొంగతనాలకు పాల్పడుతున్న తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన దాసరి నర్సయ్య, దాసరి మురళి తండ్రీకొడుకులు. కూలీ పనులు చేసుకుని జీవించే వీరికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బు సంపాధించాలనే ఆలోచనతో దొంగతనాలు మొదలు పెట్టారు.
రాత్రి సమయంలో ఎవరూ లేని ఇండ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడేవారు. గతంలో వీరిని నెల్లికుదురు పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టగా సంవత్సరం పాటు జైల్‌లో ఉండి బయటకు వచ్చారు. ప్రవర్తన మార్చుకోని తండ్రీకొడులుకు మళ్లీ దొంగతనాలు ప్రారంభించారు. మంగళవారం జిల్లా శివారులోని యశ్వంతాపూర్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానంగా కనిపించిన నర్సయ్య, మురళిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల విషయం బయటపడినట్లు తెలిపారు. వీరి నుంచి 34 తులాల బంగారం, 71 తులాల వెండి, ఒక ట్రాలీ ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సీతారాం వివరించారు. సమావేశంలో సమావేశం లో ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, నాగబాబు, ఎస్ఐలు రఘుపతి, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.