- లారీని వెనుక భాగంలో ఢీ కొట్టి ఇరుక్కుపోయిన కారు
- ఇద్దరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
- మృతులు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వాసులు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన భాష (50), షికూర్ (50), వెంకట్రావు స్నేహితులు. మీరు ముగ్గురు కలిసి కారులో గోవా వెళ్లారు. విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా మక్తల్ మండలం, గుడిగండ్ల గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక భాగంలో ఢీకొనగా లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. ఈ విషయము గమనించని లారీ డ్రైవర్ లారీని యధావిధిగా తీసుకువెళ్లాడు.
అర కిలోమీటరు పైగా ప్రమాదానికి గురైన కారుతో పాటు లారీ వెళుతుండడం చూసిన కొంతమంది లారీని ఓవర్టేక్ చేసి విషయాన్ని డ్రైవర్ కు చెప్పారు. లారీని పక్కకు ఆపి ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ భయంతో పరారు అయ్యాడు. విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని గుర్తించారు. భాష, షుఖుర్ అప్పటికే మృతి చెందగా, వెంకట్రావు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ప్రశాంత్ కు సీటు బెల్టు ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్రావును మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మక్తల్ ఎస్సై పర్వతాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.