ముద్ర ప్రతినిధి, నిర్మల్: పెరుగుతున్న వ్యాధుల నేపథ్యంలో రోగులకు తగిన స్థాయిలో వైద్యం అందే పరిస్థితి లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది క్వాక్ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. ఆసుపత్రి బోర్డుపై ఒకరి పేరు ఉంటే, చికిత్స చేసేది మరొకరు. ఈ రకమైన మెడికల్ మాఫియా పెచ్చరిల్లి పోతున్న ప్రస్తుత తరుణంలో రోగులే పెట్టుబడిగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం బైంసాలో చర్మవ్యాధి స్పెషలిస్టు చికిత్స కోసం వెళితే కనీస అర్హత లేని వ్యక్తి చికిత్స అందించేందుకు ప్రయత్నించడం ఆలస్యంగా వెలుగు చూసింది. వారానికి ఒక సారి చికిత్స అందించేందుకు వచ్చే డాక్టర్ స్థానంలో మిగతా ఆరు రోజులు దొంగ డాక్టర్ చికిత్స మాత్రమే అందుతోంది ఇది మచ్చుకు మాత్రమే.
గతంలో కూడా ఇలాంటి పలు కేసులు వెలుగు చూశాయి. ఒకరి పేరుతో మరొక వైద్యం చేయడం ఒక రకమైన దోపిడీ అయితే, అసలు అర్హతలు లేకుండా బోర్డుపై తప్పుడు అర్హతలు చూపించి వైద్యం చేసిన సంఘటనలు కూడా గతంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన కంటి వైద్య నిపుణుడి పేరుతో గతంలో ఒక వ్యక్తి నిర్మల్ జిల్లా కేంద్రంలో కొన్నేళ్లపాటు వైద్యం అందించాడు. అయితే నిజామాబాద్ వైద్యుడి గురించి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ విషయం బయటకు రావడంతో డాక్టర్ ను పట్టుకున్నారు. గతంలో కొంతమంది ఆర్ఎంపీలు సైతం చికిత్సలు జరిపి ప్రాణాలు పోగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణం అవుతోంది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు గతంలో ఈ ఉదంతాలకు సంబంధించి తనిఖీలు చేపట్టి, అర్హతలు లేని డాక్టర్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే భైంసా లో జరిగిన ఘటనకు సంబంధించి చూస్తే సదరు ఆసుపత్రి తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్న మెడికల్ మాఫియా లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారానికి ఒక రోజు సందర్శించే డాక్టర్ల ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నడుపుతున్నారు. అధికారుల, రాజకీయ అండతోనే ఈ వ్యవహారం నడుస్తోందని బహిరంగ రహస్యం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ లే స్పెషలిస్ట్ డాక్టర్లు గా చలామణి అవుతున్నా వీరిపై నిఘా కొరవడింది. ఫలితంగా వ్యాధులే ఆదాయంగా, రోగులే పెట్టుబడిగా వ్యవహారం కొనసాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి రోగుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది.