మాజీ మంత్రి రఘువీరారెడ్డిని రాజకీయాలకు అతీతంగా ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఆయన మంచితనం, సింప్లిసిటీ అందుక్కారణం. ఆయన సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు సామాన్యుల్లో ఒక సామాన్యుడిగా.. అంత సింపుల్‌గా జీవితం గడుపుతున్నారంటే నమ్మశక్యం కాదు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. తరచూ మంచి పనులతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నేళ్ల కిందట గ్రామంలో అత్యద్భుతంగా ఆలయాన్ని పునర్నిర్మించారు.
ఏపీలో శృతి మించిపోతున్న డిజిటల్ క్యాంపెయిన్స్..
వ్యవసాయం చేస్తూ, గ్రామంలోని రైతులకు సూచనలు ఇస్తూ జీవితం గడుపుతున్నారు. తన కోడలు దీక్షకు గ్రామంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో సీమంతం జరిపించారు రఘువీరారెడ్డి.ఈ సందర్భంగా తమ గ్రామం సహా పరిసర గ్రామాల్లోని గర్భిణులందరినీ ఆహ్వానించి పసుపు, కుంకుమ, గాజులు, పౌష్టికాహార కిట్లు, జాకెట్లు అందజేశారు. పండుగలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజనాలు వడ్డించి, చివరికి విస్తరాకులను కూడా తానే స్వయంగా తీసేశారు రఘువీరారెడ్డి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. రఘువీరా సింప్లిసిటీ చూసి, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.తన కోడలు దీక్ష కోరిక మేరకే ఇలా సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించామని రఘువీరారెడ్డి తెలిపారు.
‘తనతో పాటు మా మండలంలోని మా గ్రామం చుట్టుపక్కల గ్రామాలలోని గర్భిణులతో కలసి శ్రీమంతం జరుపుకొని, వారికి బహుమతులను ఇవ్వాలనే మా కోడలు దీక్ష ఆలోచనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని రఘువీరారెడ్డి ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మొత్తం 85 మంది గర్భిణులకు సీమంతం నిర్వహించి కానుకలు అందించారు. వారందరితో కలిసి రఘువీరా కోడలు దీక్ష కూడా అక్కడే సీమంతం వేడుక చేసుకున్నారు.ప్రాథమిక వైద్య కేంద్రం లోని వైద్య సిబ్బంది రఘువీరా కోడలు దీక్షకు గంధం పూసి, ఆశీర్వదించారు. కార్యక్రమానికి తరలివచ్చిన మహిళలు గర్భిణులందరికీ హారతి ఇచ్చి, సీమంతం పాటలు పాడారు.
అనంతరం గర్భిణీలందరికీ పూలు, పండ్లు, బేబీ కిట్స్ పంపిణీ చేశారు. పెద్దలందరూ నిండు మనసుతో వారిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా రఘువీరా కోడలు దీక్ష మాట్లాడుతూ గర్భిణీలు బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రక్తహీనత గర్భిణీలకు ఒక సవాల్‌గా మారిందని, దీనిని అధిగమించాలని సూచించారు. కన్నడలో కాసేపు, ఇంగ్లిష్‌లో కాసేపు ఆమె మాట్లాడారు. ‘కులమత భేదాలు లేకుండా ఇంతమందితో కలిసి నేను ఇక్కడే సీమంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ దీక్ష సంతోషం వ్యక్తం చేశారు.
జూలై నుంచి జనాల్లోకి చంద్రబాబు..
మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి తన కోడలు దీక్షకు తమ స్వగ్రామం నీలకంఠాపురం (అనంతపురం)లోని ప్రాథమిక వైద్య కేంద్రంలో సీమంతం కార్యక్రమం నిర్వహించారు. పరిసర గ్రామాల్లోని గర్భిణిలందరినీ ఆహ్వానించి సామూహిక సీమంతం వేడుక జరిపించారు. గర్భిణులందరికీ కానుకలు ఇచ్చి, భోజనాలు వడ్డించారు.గర్భిణులందరికీ పసందైన వంటకాలతో విందు భోజనాలు వడ్డించారు. రఘువీరారెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ.. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ భోజనాలు పెట్టించారు. చివరికి వారు తిన్న విస్తరాకులను ఆయనే స్వయంగా ఎత్తివేశారు. మాజీ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా కీలక బాధ్యతలు నిర్వహించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదూ.