Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రతి వ్యూహం బూమరాంగ్ ఎందుకిలా…

0

హైదరాబాద్, ఫిబ్రవరి 14:మాటల మాంత్రికుడు.. రాజకీయ వ్యూహ చతురుడు కేసీఆర్. తొమ్మిదేళ్లుగా తెలగాణ కేసీఆర్ కు పర్యాయపాదాలుగా వాడే పదాలు అవే. అయితే గత కొద్ది కాలంగా ఆయన మాటలు మంత్రాలుగా చెలామణి కావడం లేదు. వ్యూహాలు వికటిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత ప్రణాళికలు పారడం లేదు సరికదా బూమరాంగ్ అవుతున్నాయి. అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటి  బోల్తా పడ్డావులే దొరా అన్నట్లుగా తయారైంది కేసీఆర్ పరిస్థితి.కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ వాయిదా పడడంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం రోజునే ప్రారంభించాల్సి ఉన్నది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ హాజరవుతున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

మూడు పార్టీల నేతలు వస్తుండడంతో అనుకున్న సమయానికి పనులను పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది సరైన కారణం కాదంటూ విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.రాజకీయపరమైన కారణాలతో స్టాలిన్, తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్దేశంలేదని తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో ఉంటూ కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకవైపు కాంగ్రెస్‌ తో కొనసాగుతూనే మరోవైపు దానికి వ్యతిరేకంగా పెట్టే బీఆర్ఎస్ ఈవెంట్‌ కు వెళ్లడం పొలిటికల్‌ గా చర్చకు దారితీస్తుందనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తేజస్వి యాదవ్ సైతం పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగానే ఈ ప్రోగ్రామ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.బిహార్‌లో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినందున బీఆర్ఎస్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటే అది రాష్ట్రంలో వివాదంగా మారుతుందనే ఆందోళనతోనే గైర్హాజరు కావాలనుకుంటున్నట్లు తెలిసింది. సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యే వీరిని అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు కూడా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ హాజరుకానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా, ఆయన రాకపై స్పష్టత రాలేదు. జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీ సైతం కాంగ్రెస్‌ తో స్నేహ సంబంధాల్లోనే ఉన్నది.

రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నందున కేసీఆర్ ఆహ్వానం మేరకు హాజరుకావడంపై మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి.కొత్త సచివాలయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయడం వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. విపక్షాలు సైతం కొన్నింటిని ప్రస్తావించి విమర్శలు చేశాయి. అగ్నిప్రమాదం జరిగినందునే వాయిదా వేసిందనే వార్తలూ వచ్చాయి. తుది దశ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయని, ప్రారంభోత్సవం తేదీ నాటికి పూర్తికావనే ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్‌ను సాకుగా చూపి ప్రభుత్వం వాయిదా వేసిందనే ఊహాగానాలూ వినిపించాయి. పుట్టినరోజు వ్యక్తిగతమైన అంశమని, పాలనకు సంబంధించిన కార్యక్రమాలకు ఆ తేదీన ముహూర్తం ఖరారు చేయడం సమంజసం కాదన్న విమర్శలూ వచ్చాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసి సుమోటోగా తీసుకోవాలని కోరారు.

ఒకేసారి అన్ని పార్టీల నుంచి విమర్శలు రావడం, ప్రజల నుంచి అనుమానాలు తలెత్తడం ఎలా ఉన్నా రాజకీయ కారణాలతో గెస్టులుగా రావాల్సిన స్టాలిన్, తేజస్వి రాకపోవడం కారణంగానే వాయిదా వేశారనే చర్చ జరుగుతున్నది.ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమానికి ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులను ఆహ్వానించిన కేసీఆర్ ఆ రోజు జరిగిన బహిరంగసభలో సైతం వారు హాజరయ్యేలా చూసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి పొలిటికల్ మీటింగులోనూ పాల్గొనేలా చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు బహిరంగంగానే కామెంట్ చేశారు. ఈసారి సైతం అదే తరహా రిపీట్ అయ్యే అవకాశాలతో ముందుగానే స్టాలిన్, తేజస్వి అలర్టయినట్లు తెలిసింది.ముఖ్యంగా ఫామ్ హౌస్ కేసు విషయం నుంచి నూతన సచివాలయం ప్రారంభోత్సవం వరకూ ఆయన ఏం అనుకున్నా అందుకు రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది సీఎంలో అసహనం పెంచుతోందా అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఔననే అంటున్నాయి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం విషయంలో కూడా కోర్టు వరకూ వెళ్లి కూడా కేసు ఉపసంహరించుకుని మరీ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కేసీఆర్ ఎంతగా డిఫెన్స్ లో పడ్డారో అందరికీ తేటతెల్లం చేసింది. వ్రతం చెడ్డా కూడా ఫలం దక్కలేదన్నట్లు.. గవర్నర్ ను స్వయంగా అసెంబ్లీలోకి ఆహ్వానించినా కూడా  గతేడాది సెప్టెంబరులో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్‌లోనే ఉంచారు.  అంతకు ముందుఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విషయంలోనూ ఆయన తొందరపాటు కారణంగానే.. సభకు జనాన్ని బాగానే సమీకరించగలిగినా… ఆయన అనుకున్న విధంగా బీఆర్ఎస్ కు కావలసినంత మైలేజీ రాలేదు. హస్తిన వేదికగా భారీ బహిరంగ సభ అని తొలుత అనుకున్నప్పటికీ.. తెలుగుదేశం ఖమ్మం సభ విజయవంతం కావడం.. రాష్ట్రంలో ఆ పార్టీ పూర్వ వైభవం దిశగా వేగంగా కదులుతోందన్నఅంచనాల నేపథ్యం ఒక వైపు..

ఖమ్మం నుంచి ఇద్దరు పలుకుబడి కలిగిన నాయకులు తుమ్మల, పొంగులేటి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న ప్రచారం మరో వైపీ.. అన్నిటికీ మించి ప్రధాని మోడీ వందే భారత్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నరన్న సమాచారంతో బీఆర్ఎస్ సత్తా చాటకపోతే వెనుకబడిపోతామన్న భావనతో గత నెల 18నే ఆయన ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్బావ సభ నిర్వహించేశారు.అది విజయవంతం అయ్యిందా లేదా అన్న విషయం కంటే జాతీయ పార్టీ  ఆవిర్భావ సభ హస్తిన వేదికగా నిర్వహించి ఉంటే వచ్చే మైలేజే వేరుగా ఉండేది.. అయితే కేసీఆర్ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు.  ఇక  బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకను కూడా అనివార్యంగా వాయిదా వేసుకోవలసిన పరిస్థితి కేసీఆర్ కు ఏమంత సంతోషం కలిగించే విషయం కాదు.

అసలు నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి తన పుట్టిన రోజును ముహూర్తంగా నిర్ణయించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.తీరా ప్రారంభోత్సవ తేదీ ప్రకటించేసిన తరువాత నూతన సెక్రటేరియెట్ లో సంభవించిన అగ్ని ప్రమాదం నెగటివ్ సెంటిమెంట్ ను స్ఫురింప చేసింది. అదలా ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ అంటూ ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఫామ్ హౌస్ కేసు, రిపబ్లిక్ డే నిర్వహణ ఇలా కేసీఆర్ ఇటీవలి కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి వ్యూహం బూమరాంగ్ అవుతూనే వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie