మహిళ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నిర్ణయం: మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణం సుందరయ్య నగర్ లోని ప్రజా ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన మహిళా ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో పురపాలక సంఘ మహిళా పాలకవర్గ సభ్యులకు, మహిళ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం వారు తీసుకున్న గొప్ప నిర్ణయంగా యావత్ తెలంగాణ ఈరోజు స్వాగతిస్తుంది అని అన్నారు.
ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు వారి ఆరోగ్య నిమిత్తం అవసరమైన అతి ముఖ్యమైన డయాగ్నస్టిక్స్, సూక్ష్మ పోషక లోపాల, కుటుంబ నియంత్రణ, ఋతుస్రావ సమస్యల, లైంగిక వ్యాధుల నిర్వహణ, క్యాన్సర్ స్క్రీనింగ్, మూత్ర నాళ ఇన్ఫెక్షన్, మోనోఫాజ్ నిర్వహణ, శరీర బరువు నిర్వహణ వంటి ప్రధానమైన ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఎనిమిది రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వైద్య నిపుణులచె వైద్య సేవలు అందించబడతాయని అన్నారు. ఈ క్రమంలో మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించి పేషంట్ రికార్డ్ మాన్యువల్ గానే కాకుండా, డిజిటల్ విధానంలోనూ పొందు పరిచి ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ చేయబడుతుంది అని తెలిపారు.
ఎవరికైనా మహిళలకు మెరుగైన వైద్యం అవసరమైతే ప్రత్యేక వైద్య నిపుణులకు రెఫర్ చేస్తారని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో మహిళలకు వైద్య సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడిందని తద్వారా మహిళలకు పూర్తిగా ఆరోగ్యం బాగుపడే వరకు వైద్య సేవలు అందించబడతాయని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కేసిఆర్ కిట్, అమ్మ ఒడి, సంక్షేమ హాస్టల్ నిర్వహణ, కళ్యాణ లక్ష్మి వంటి వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళల సంక్షేమానికి , షీ టీమ్స్, సఖి కేంద్రాలు నిర్వహణ ద్వారా మహిళా రక్షణకు కృషి చేస్తూ, విద్యా ఉద్యోగ అవకాశాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ, గృహలక్ష్మి వంటి కార్యక్రమంలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇలా ప్రతి సందర్భంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలంగాణ మహిళా లోకం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. మహిళా సోదరీమణులు అందరూ కచ్చితంగా ప్రతి మంగళవారం నిర్వహించే ఈ మహిళా ఆరోగ్య కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు దిడ్డి మాధవి రాజు, దూస వినయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ మహిళా అధికారులు , పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మహిళా అధికారులు, ఆర్పీ లు, పట్టణ మహిళ సమైక్య సంఘాల సభ్యులు, మున్సిపల్ మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.