Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్

Electric buses in Hyderabad

0
  • త్వరలో అందుబాటులోకి 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
  • కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సును పరిశీలించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్

ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని వారిని ఆదేశించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ
హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతుందన్నారు. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చామని, అందులో 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే విజయవాడ రూట్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, హైదరాబాద్ లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని చెప్పారు. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయని, మరో 30 ఐటీ కారిడార్ లో నడుస్తాయన్నారు. వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్థ ప్లాన్ చేస్తోందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తున్నాయని, అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయి న్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రా అందజేయనుందని తెలిపారు. వీటికి తోడు సిటీలో మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్ లో ఉందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) వేణుగోపాల్‌ రావు, మేనేజర్ ఆనంద్‌ బసోలి, అసిస్టెంట్ మేనేజర్ యతిష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలు: 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుంది.

గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో Fire Detection Suppression System (FDSS) ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం (ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జింగ్ కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie