హైదరాబాద్, జనవరి 30,
ఇప్పటి వరకు పాదయాత్రలతో ప్రజలకు చేరువైన బీజేపీ రూట్ మార్చనుంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రథ యాత్రలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సంస్థాగతంగా బలోపేతంపై ఫోకస్ పెట్టిన కాషాయ పార్టీ వరుస కార్యకలాపాలతో నిత్యం ప్రజల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. వచ్చే తొమ్మిది నెలల కాలాన్ని మూడు విడుతలుగా విభజించుకున్న కమలనాథులు ఆ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తూ రథ యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రథ యాత్రలు చేపట్టాలని కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. రథ యాత్రలకు ప్రత్యేకంగా ఐదు వాహనాలను సిద్ధం చేసుకోనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో కాషాయ పార్టీ నేతల పర్యటనలకు మొత్తం 5 బస్సులు సిద్ధమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలకు ఒక బస్సును ప్రత్యేకంగా రూపొందించనున్నారు.మిగిలిన 4 బస్సులను కీలక నేతల పర్యటనలకు వినియోగించనున్నారు.
మొత్తంగా ఈ 5 బస్సులు ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా నిత్యం చక్కర్లు కొట్టనున్నాయి. ఒక వాహనం పూర్తిగా రాష్ట్ర అధ్యక్షుడికి కేటాయించారు. ఈ రథ యాత్రల్లో నేతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు రాకుండా పార్టీలోని ముఖ్య నేతలకు సమ ప్రాధాన్యం కల్పించనున్నారు. 4 వాహనాలను ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలోని ముఖ్య నేతలకు అందించనున్నారు. ఆయా సెగ్మెంట్లలో బలమైన నేత లోనిచోట రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు.రథ యాత్రలు విడుతల వారీగా నిర్వహించేలా బీజేపీ ప్లాన్ చేసుకుంది. 5 వాహనాలు అన్ని పార్లమెంట్ నియోజకవవర్గ కేంద్రాల్లో తిరిగేలా నిర్ణయించుకున్నారు. దీన్నిబట్టి ఒక్కో సెగ్మెంట్ లో విడుతలుగా 5 వాహనాలు తిరిగనున్నాయి.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించినా మిగిలిన నేతలు కూడా విజిట్ చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంది. ఒక్కో సెగ్మెంట్ రివ్యూపై బండి సంజయ్ కనీసం 24 గంటలు కేటాయించనున్నారు. ఈ రథ యాత్రలో పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్షలు చేయనున్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది క్లారిటీ ఇవ్వనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాలన, వైఖరిపైనా వివరించనున్నారు. ఇదిలా ఉండగా అప్పటి వరకు నేతల అవసరాన్ని బట్టి రథాల సంఖ్య పెంచడంపైనా బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఎన్నికల సమయం నాటికి పార్లమెంట్ కో రథాన్ని కేటావయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని శ్రేణులు చెబుతున్నాయి. దీన్నిబట్టి జాతీయ నాయకత్వం తెలంగాణపై ఎంత ఫోకస్ పెట్టింది అనేది అర్థం చేసుకోవచ్చు. మరి పాదయాత్రలతో గ్రామీణ ప్రాంతలకు చేరువైన కమలం పార్టీకి రథ యాత్రలు ఎంత మేరకు కలిసి వస్తుందనేది వేచి చూడాల్సిందే.