కాకినాడ:తెల్లకోటు ధరించి, మెడలో స్టెతస్కోప్ వేసుకుని వైద్యురాలిలా కాకినాడ జీజీహెచ్ ప్రాంగణంలో తిరుగుతూ ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం చేసిన యువతిని ఒకటో పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన సానా అరుణసాయి(24) జీఎన్ఎం కోర్సు పూర్తిచేసింది. ఎక్కడా ఉద్యోగం లభించకపోవడంతో గత డిసెంబరు నుంచి జీజీహెచ్లో ప్రయత్నించింది. అక్కడా ఉద్యోగం లభించలేదు.అనంతరం ఆమె వైద్యురాలి అవతారం ఎత్తింది. రోజూ ఆసుపత్రికి వెళ్తుండేది. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఎస్.మమత, మాధురి పరిచయమయ్యారు. ఖాళీగా ఉన్నామని ఉద్యోగం ఇప్పించాలని వారిద్దరూ ఆమెను కోరారు.ఇదే అదనుగా తీసుకున్న అరుణసాయి ఆరోగ్య మిత్రలో ఉద్యోగాలు ఇప్పిస్తానని దానికి కొంత ఖర్చవుతుందని చెప్పింది.
వారిద్దరూ ఆమెకు పలు దఫాలుగా రూ.47వేలు అందజేశారు. అనంతరం ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించి ఇద్దరూ గురువారం జీజీహెచ్కు వెళ్లారు. సెక్యూరిటీగార్డు సహాయంతో నిందితురాలిని పట్టుకుని అవుట్పోస్టు పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమెను వన్టౌన్ పోలీసుస్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో ఇంకా ఎవరినైనా మోసం చేసిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.