- టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత విజ్ఞప్తి
- పారదర్శకంగానే పరీక్షల నిర్వహన
- పలు శాఖల అధికారులకు మంత్రి సూచన
- హిందీపేపర్ లీక్‌పై మంత్రి ఆరా
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశం
తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లొళ్ల సబితా ఇంద్రారెడ్డి కోరారు. పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలన్నారు. కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.
పరీక్షలు రాస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దని మంత్రి కోరారు. రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం వీడాలన్నారు. వరంగల్ జిల్లాలో హిందీ ప్రశ్నాపత్రంబయటకు వచ్చిన అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని వరంగల్, హనుమకొండ డీఈవోలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వరంగల్ డీఈవో వాసంతి సీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందీ క్వశ్చన్ పేపర్ ఏ స్కూల్ నుంచి బయటకు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.