- టిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకం
- టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి
తిరుమల, ఏప్రిల్ 15:తిరుపతిలోని స్విమ్స్ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో టిబి, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి ధర్మకర్తలమండలి సమావేశం శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.టిటిడి అవసరాలకు గాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్ తో చర్చించేందుకు టీటీడీ బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ సనత్ కుమార్, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కమిటీ ఏర్పాటు.
– అలిపిరి వద్ద గల మార్కెటింగ్ గోడౌన్ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు మరియు కోల్డ్ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు.
– గుంటూరుకు చెందిన దాత ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం.
– తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం.
– న్యూఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో ఆడిటోరియం అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్లు మంజూరుకు ఆమోదం.
– టిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకానికి ఆమోదం. ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం.
– ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం.
– తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులను త్వరితగతిన పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం.
– ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాం. ఏప్రిల్ 5న జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి భక్తులకు అవసరమైన సదుపాయాలన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తున్నాను.
– ఎఫ్.సి.ఆర్.ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుండి విరాళాలు స్వీకరించడానికి టిటిడికి అనుమతి ఉంది.ఈ అనుమతి 2020 జనవరికి ముగిసింది. దీనిని రెన్యువల్ చేసుకోవడానికి టిటిడి దరఖాస్తు చేసింది.పలు దఫాలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరిగింది. ఎఫ్.సి.ఆర్.ఏ, రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టాల మధ్య ఉన్న సాంకేతిక కారణాల వల్ల విరాళాల డిపాజిట్లపై వచ్చే వడ్డీని చూపించడంలో కొన్ని అభ్యంతరాలు తెలిపారు. ఇది సాంకేతిక కారణం మాత్రమే.
ఎఫ్.సి.ఆర్.ఏ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లించడం జరిగింది.ఇందుకోసం చెల్లించిన రూ.3 కోట్ల సొమ్మును తిరిగి పొందడానికి కృషి చేస్తున్నాం.మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ పాల్గొన్నారు.