జోగులాంబ గద్వాల్: గద్వాల్ జిల్లా కేంద్రం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గద్వాల పాత బస్టాండ్ సెంటర్లో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి, మాట్లాడుతూ ప్రధాని తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు, వాటాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరాకరిస్తున్నదని, విమర్శించారు. రాష్ట్రం పైన వివక్షను ప్రదర్శిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నదని అన్నారు. సింగరేణి వంటి సంస్థలను పూర్తిగా ప్రైవేటికరించడానికి కేంద్రం పూనుకుంటున్నదని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నదని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, ఎన్టిపిసి విద్యుత్ కేంద్రం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వంటి విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. యూపీఏ హయాంలో మంజూరైన ఐటిఐఆర్ ను రద్దు చేసిందని తెలిపారు. కృష్ణా నదిజలాల పంపిణీ పంచాయితీపై రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రెండు నదులను తన పరిధిలోకి కేంద్రం లాక్కున్నదని అన్నారు.
గిరిజన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కేంద్రం పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు వెంకటస్వామి, తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం. సిఐటియు. నాయకులు ఆంజనేయులు, విష్ణు, దేవన్న, భాస్కర్, పరుశరాముడు, లక్ష్మన్న, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, గోపాల్, నరసింహులు, ఆది, కళ్యాణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.