- 5 కత్తులు, కారు 4 బైక్ లు, 8 సెల్ ఫోనులు సీజ్
- అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి ఎగ్గడి భాస్కర్
కోరుట్ల పట్టణంలో మూడు రోజుల క్రితం టి హోటల్లో ఉదయం టి తాగేందుకు వచ్చిన బిఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మిరాజంఫై కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. కోరుట్ల పోలిస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆగుస్ట్ 8న ఉదయం కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని శంకర్ టి స్టాల్ లో టి తాగేందుకు వచ్చిన కౌన్సిలర్ భర్త అయిన లక్ష్మీరాజంను ముసుగులు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి బైక్ ఫై పారి పొగ , తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీరాజంను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగ మరణించాడు. మృతుడు లక్ష్మీరాజం భార్య ఉమారాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుట్ల పట్టణానికి చెందిన విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు, కాసుల వంశీ, మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పిల్లి సత్యనారాయణ లపై కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు మెట్పల్లి డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు, 5గురు ఎస్ ఐలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా శుక్రవారం ఉదయం విత్తనాల నాగరాజు కారులో పారిపోతున్న నాగరాజు తో పాటు విశాల్, వంశీ, మధు, దీపక్ అలియాస్ సిద్ధులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేయడానికి గల కారణాలు వివరించినట్లు తెలిపారు.
అలాగే వారు వాడిన ఆయుధాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి, పిల్లి సత్యనారాయణ వంశీ, విశాల్, మదన్మోహన్, దీపక్ అలియాస్ సిద్దు, ప్రభాస్ లు 8 మంది కలిసి భూదందా, ల్యాండ్ సెటిల్మెంట్ లో ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను భయపెట్టి సెటిల్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కోరుట్ల పట్టణంలో పేరున్న వ్యక్తిని అందరు చూస్తుండగా రోడ్డు మీద హత్య చేసినట్లయితే ప్రజలలో నాగరాజు తో పాటు అతని అనుచరులంటే భయం కలుగుతుందని ఆ తర్వాత కోరుట్ల పట్టణంలో ఏ సెటిల్మెంట్ అయినా తామే చేయవచ్చని అనుకున్నారు. అందుకు లక్ష్మీరాజమే సరైన వ్యక్తి అని ఎంచుకొని జులై 30న వంశీ వాళ్ళ ఇంటి మీద దావత్ చేసుకొని హత్యకు పథకం పన్నారు. వారి పథకంలో భాగంగా నరసింహా అనే వ్యక్తి లక్ష్మీరాజం కదలికలను గమనిస్తూ నాగరాజుకు చేరవేయలని సరైన సమయం స్థలం చూసి నాగరాజుకు చెబితే నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు లక్ష్మీరాజమును హత్య చేసి ఆ హత్యను పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు తామే చేసినట్లుగా పోలీసులకు లొంగిపోవాలని అందుకు నాగరాజు వారికి రూ. లక్ష, కొంత భూమి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు సహకరించిన మిగిలిన వారికి కూడా ఒక్కొక్కరికి రూ. లక్ష సర్దుతానని చెప్పాడు.
ఇందులో భాగంగానే ఆగస్టు 8న ఉదయం శంకర్ హోటల్ కు టీ తాగేందుకు వచ్చిన లక్ష్మీరాజంను గమనించి నరసింహ వాట్సాప్ కాల్ ద్వారా నాగరాజుకు సమాచారం అందించాడు. వెంటనే నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి ఒకే బైక్ పై వచ్చి లక్ష్మీరాజంపై నాగరాజు కత్తితో దాడి చేశాడు. అతని తమ్ముడు త్రిమూర్తి నాగరాజును తీసుకోవడానికి బైక్ పై సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో విశాల్, పిల్లి సత్యనారాయణ ఒకవైపు వంశీ, అతని తమ్ముడు మదన్మోహన్ మరో బైక్ పైన దీపక్ అలియా సిద్దు, ప్రభాస్ లు మరో బైక్ పై మూడు వైపులా లక్ష్మీరాజం పారిపోకుండా చూస్తుండగా నాగరాజు లక్ష్మీరాజంపై కత్తితో దాడి చేశాడు. వెంటనే అక్కడి నుండి నిందితులు వంశి వాళ్ళ పొలం దగ్గరకు వెళ్లి 9 మంది కలుసుకొని వారి పథకంలో భాగంగా అక్కడి నుంచి పిల్లి సత్యనారాయణ త్రిమూర్తులు కలిసి లక్ష్మీరాజమును చంపినారని పోలీసులకు అనుమానం వచ్చే విధంగా ఉండాలని పల్సర్ పై అక్కడ నుంచి పారిపోయారు.
హత్య చేస్తుండగా అక్కడే చూసిన కొందరు నాగరాజును గుర్తుపట్టారని తెలుసుకుని లక్ష్మీరాజంను చంపడానికి ఉపయోగించిన కత్తులు హత్య చేసిన రోజు వారు ఉపయోగించిన బైక్లను వంశీ వాళ్ళ పొలం దగ్గర దాచిపెట్టి వారు కూడా పోలీసులకు దొరకకుండా దాక్కొని శుక్రవారం ఉదయం కోరుట్ల మీదుగా పారిపోతుండగా కోరుట్ల పట్టణ సిఐ ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హత్యపై మరికొంతమందిపై అనుమానం ఉందని మృతుని బంధువులు పేర్కొనడంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సాంకేతిక సమాచారం సేకరించి, దీని వెనుక ఎంతమంది నిందితులు ఉన్నారు, ఎవరెవరి ప్రమేయం ఉందనే పూర్తి వివరాలను ఆధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఎస్పి పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఐదు కత్తులు, ఒక కారు, నాలుగు బైకులు, 8 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో మెట్పల్లి డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేదించిన కోరుట్ల మెట్పల్లి, సిఐలు ప్రవీణ్, లక్ష్మీనారాయణ, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, పెగడపల్లి ఎస్సైలను, సిబ్బందిని జిల్లా ఎస్పీ భాస్కర్ అభినందించారు.